డాక్టర్‌ వసంత్‌కుమార్‌ ప్రవర్తన వైద్యవృత్తికే కళంకం

14 Feb, 2020 10:12 IST|Sakshi
హెచ్‌ఓడీలు, పాలన యంత్రాంగంతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌

గాంధీఆస్పత్రి : గాంధీ ఆస్పత్రి క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించిన టీజీజీడీఏ గాంధీ యూనిట్‌ కార్యదర్శి డాక్టర్‌ వసంత్‌కుమార్‌ ప్రవర్తన వైద్యవృత్తికే కళంకం తెచ్చేవిధంగా ఉందని గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ అన్నారు. వసంత్‌కుమార్‌ చేసిన అవినీతి ఆరోపణలు  మతిస్థిమితం కోల్పోయి చేస్తున్నవిగా కొట్టిపారేశారు. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవమైన వైద్యవృత్తిలో ఉంటూ వసంత్‌కుమార్‌ చేసిన ఆత్మహత్యాయత్నం, డబ్బుల కోసం క్యాంటిన్, మెడికల్‌షాపుల యజమానులు, కాంట్రాక్టర్లు...చివరకు కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న చిరుఉద్యోగులపై బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డాడని, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు, వీడియో, ఆడియో క్లిప్పింగులు తమవద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. హౌస్‌సర్జన్లు విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు. 2019 మార్చినెల నుంచి హౌస్‌సర్జన్లకు బయోమెట్రిక్, ఐరిస్‌ నమోదుతోపాటు హెచ్‌ఓడీలు రాజారావు, విమల«థామస్, కృష్ణమోహన్‌ త్రిసభ్య కమిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఎటువంటి అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేదని,  సమర్థవంతమైన పాలనాయంత్రాంగం ఉందన్నారు. 

వసంత్‌కుమార్‌ డబ్బులు డిమాండ్‌ చేశారు
డాక్టర్‌ వసంత్‌కుమార్‌ డబ్బులు ఇవ్వాలని బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డాడని క్యాంటిన్, మెడికల్‌ షాపు నిర్వాహకులు, పారిశుధ్యం, సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ ప్రతినిధులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపించారు. వారంతా మీడియాతో మాట్లాడుతూ డబ్బుల కోసం డిమాండ్‌ చేసిన ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లను మీడియాకు విడుదల చేశారు.  

హెచ్‌ఓడీలతో సమావేశం
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అన్ని విభాగాల హెచ్‌ఓడీలతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మెరుగైన సేవలు, మరింత పారదర్శకమైన పాలన అందించేందుకు తగిన సలహాలు, సూచనలు స్వీకరించారు.  వసంత్‌కుమార్‌ చేసిన ఆరోపణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.  

మరిన్ని వార్తలు