మానసికంగా బాగానే ఉన్నా: డాక్టర్‌ వసంత్‌

13 Feb, 2020 17:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో వైద్యుల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. వైద్యులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో  తాను మానసికంగా బాగానే ఉన్నానని సస్పెన్షన్‌కు గురైన గాంధీ ఆస్పత్రి వైద్యుడు వసంత్‌ స్పష్టం చేశారు. తనకు మతి స్థిమితం లేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌ కుమార్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎవరి నుంచి డబ్బులు డిమాండ్‌ చేయలేదని ఆయన పేర్కొన్నారు. (పెట్రోల్ బాటిళ్లు నడుముకు కట్టుకుని...  )

‘ నా వ్యక్తిగత విషయాలు, బంధువులతో మాట్లాడిన సంభాషణలను బహిర్గతం చేశారు. శ్రవణ్‌ కుమార్‌ చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే గాంధీ ఆస్పత్రి వైద‍్యులు, సిబ్బందితో అబద్ధాలు చెప్పిస్తున్నారు. బయోమెట్రిక్‌ పద్ధతి లేకుండా చాలా అక్రమాలకు పాల్పడ్డారు. శానిటేషన్‌ విషయంలో ప్రతి ఒక్కరూ డీఎంఈకి ఫిర్యాదు చేశారు. నేను ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో నిర్ణయాలు తీసుకుంటే నాపై కక్ష కట్టారు. డీఎంఈ రమేశ్‌ రెడ్డి ఇప్పటికైనా న్యాయం వైపు మాట్లాడాలి’ అని డాక్టర్‌ వసంత్‌ కోరారు. కాగా గాంధీ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తడంతో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ యోగితా రాణా గురువారం సాయంత్రం ఆస్పత్రిని పరిశీలించారు.

కాగా గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు కోవిడ్‌–19 (కరోనా వైరస్‌) బారినా పడినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగంతో  సీఎంవో డాక్టర్‌ వసంత్‌  సస్పెండ్‌ అయ్యారు. అయితే తాను చేయని తప్పుకు బలయ్యానని.. తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మంగళవారం నడుము చుట్టూ పెట్రోల్‌ బాటిళ్లను కట్టుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు