మెటర్నిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీగా ‘గాంధీ ఆస్పత్రి’

4 Dec, 2019 10:15 IST|Sakshi

200 పడకలతో ఏర్పాటుకు సర్కారు నిర్ణయం

అత్యాధునిక వసతులతో అన్ని సౌకర్యాలు

సాక్షి, హైదరాబాద్‌: మెటర్నిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగే హైరిస్క్‌ ప్రసవాలను భవిష్యత్‌లో ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేకంగా మెటర్నిటీ కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఐసీయూ సహా అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దుతారు. దీనికోసం జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎంసీహెచ్‌) నుంచి రూ.50 కోట్లు మంజూరయ్యాయి. అందులో ఇప్పటివరకు రూ.30 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రంలోనే అన్ని ఆస్పత్రులకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా ఇది నిలవనుంది. ఏరియా, జిల్లా, ఇతర ఆస్పత్రుల నుంచి కేసులను ఇక్కడకు రిఫర్‌ చేస్తారు. సాధారణ ప్రసవాలకు ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో 150 పడకలు ఉన్నాయి. వాటితో సంబంధం లేకుండా కొత్తగా వచ్చే 200 పడకలను హైరిస్క్‌ కేసుల కోసం కేటాయిస్తారు. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోనే డెలివరీలకు మోడల్‌గా ఉంటుందని వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు.

అనారోగ్య సమస్యలున్న గర్భిణుల కోసం..
గర్భిణీలకు ఒక్కోసారి అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ప్రసవం సమయంలో హైబీపీ రావడం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తడం, కిడ్నీ పరమైన ఇబ్బందులు ఉండటం వంటి కారణాలతో ఒక్కోసారి పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారుతుంది. సంక్లిష్టమైన కేసులకు ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో సక్రమంగా డెలివరీ చేసే పరిస్థితులు లేవు. ఉదాహరణకు ప్రసవం సమయంలో గర్భిణీకి హైబీపీ వచ్చినప్పుడు సాధారణ జనరల్‌ ఫిజీషియన్‌ పరిస్థితిని నియంత్రించలేరు. దీనికి తప్పనిసరిగా సూపర్‌ స్పెషాలిటీ కోర్సు చేసిన జనరల్‌ ఫిజీషియనే అవసరం. అలాగే గుండె సంబంధిత సమస్య వస్తే కార్డియాలజిస్ట్‌ కావాలి. కిడ్నీ సంబంధిత సమస్య ఉంటే నెఫ్రాలజిస్టు కావాలి. కానీ ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో అటువంటి సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు లేనేలేరు. కాబట్టి హైరిస్క్‌ కారణాలతో మాతృత్వపు మరణాలు సంభవిస్తున్నాయి. బహుళ అనారోగ్య సమస్యలతో బాధపడే గర్భిణీలు హైరిస్క్‌లో ఉంటే అటువంటి వారిని ఏరియా, జిల్లా ఆస్పత్రుల నుంచి గాంధీ ఆస్పత్రికి రిఫర్‌ చేసేలా ఏర్పాట్లు చేస్తారు. గాంధీ బోధనాస్పత్రి కావడంతో అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉంటారని, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారని డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా