‘అత్త’ మొక్కకు అలంకరణ

29 Apr, 2019 07:44 IST|Sakshi

కోడలుకు చూపించేందుకు ఏర్పాట్లు  

మొక్క చుట్టూ కంచె..  

గాంధీఆస్పత్రి: అత్త నాటిన మొక్కను కోడలుకు చూపించేందుకు గాంధీ ఆస్పత్రి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 1983లో బ్రిటన్‌ రాణిఎలిజబెత్‌–2 పాత గాంధీ ఆస్పత్రిలో మొక్కను నాటడం, తర్వాత అది మోడుబారిపోవడం... ఆమె చిన్న కోడలు సోఫీ హెలెన్‌ సోమవారం ఆస్పత్రిని సందర్శించనున్న తరుణంలో మరోసారి చిగురించడంపై ‘అత్త.. కోడలు.. ఓ మొక్క’ శీర్షికతో ‘సాక్షి’ ఆదివారం కథనం ప్రచురించింది. దీనికి విశేష స్పందన లభించింది. ఈ మొక్కను చూసేందుకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, రోగుల సహాయకులు పెద్ద ఎత్తున రావడంతో గాంధీ మెడికల్‌ కళాశాల ప్రాంగణంలో సందడి నెలకొంది. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పి.శ్రవణ్‌కుమార్, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఒ.శ్రవణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు రాణి నాటిన ‘సైకస్‌’ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. కంచె, క్వీన్‌ఎలిజబెత్‌ నాటిన మొక్క అని పేర్కొంటూ బోర్డును ఏర్పాటు చేశారు. క్వీన్‌ ఎలిజబెత్‌ డైమండ్‌ జూబ్లీ ట్రస్ట్‌ వైస్‌ ప్యాట్రన్, కౌంటీస్‌ ఆఫ్‌ వెసెక్స్‌ సోఫీ హెలెన్‌ సోమవారం ఉదయం 11గంటలకు గాంధీ ఆస్పత్రికి వస్తారు. దాదాపు గంటపాటు చిన్న పిల్లల విభాగంలోని ఎన్‌ఐసీయూ, రెటినోపతి ఆఫ్‌ ప్రీ మెచ్యూరిటీ సేవలను పరిశీలిస్తారు.

ఈ ఏడాది చివరిలో ట్రస్ట్‌ను రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆమె మళ్లీ ఇక్కడికి వచ్చే అవకాశం లేదని భావించిన వైద్యాధికారులు... ఆమె తిరిగి వెళ్లే సమయంలో అత్త క్వీన్‌ ఎలిజబెత్‌–2 నాటిన మొక్కను చూపించాలనే పట్టుదలతో ఉన్నారు. ‘సాక్షి’ ప్రచురించిన కథనాన్ని అందంగా అలంకరించి ఆమెకు బహుమతిగా అందజేస్తామని వైద్యాధికారి ఒకరు తెలిపారు. పాత గాంధీ ఆస్పత్రి నుంచి మొక్కను ఇక్కడికి తీసుకొచ్చిన అప్పటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఏవై చారి మాట్లాడుతూ... పదవీ విరమణ తర్వాత గాంధీ ప్రాంగణానికి ఎప్పుడు వెళ్లినా రాణి నాటిన మొక్క ఎలా ఉందోననే ఆసక్తితో ఓ లుక్కేస్తానని వివరించారు. సోఫీ హెలెన్‌ను కలిసేందుకు సెక్యూరిటీ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం (అలూమ్నీ అసోషియేషన్‌) ప్రతినిధులు తెలిపారు. 

మరిన్ని వార్తలు