‘గాంధీ’లో ఓపీ చిట్టీల దందా

26 Mar, 2019 07:29 IST|Sakshi

నిరుపేద రోగులపై ఓపీ సిబ్బంది దురుసు ప్రవర్తన  

మహిళా కాంట్రాక్టు ఉద్యోగిపై ఫిర్యాదుల వెల్లువ

వెనకేసుకొచ్చిన ఓపీ ఇన్‌చార్జి ఆర్‌ఎంఓ

గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి అవుట్‌పేషెంట్‌ విభాగంలో ఓపీ చిట్టీలు ఇచ్చే సిబ్బంది దురుసు ప్రవర్తన కారణంగా నిరుపేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్న రోగులను కాదని సిబ్బంది తమ అనుయాయులు, తెలిసినవారికి క్షణాల్లో ఓపీ చిట్టీలు అందిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై మాటలతో ఎదురుదాడికి దిగుతున్నారు. ఇష్టం వచ్చిన చోట ఫిర్యాదు చేసుకొమ్మంటూ కసురుకుంటున్నారు.సాక్షాత్తు ఓపీ ఇన్‌చార్జి ఏఆర్‌ఎంఓ సైతం ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారి సమస్య వినకుండానే కంప్యూటర్‌ హ్యాంగ్‌ అయ్యిందట, ఇలాంటి సహజమే అంటూ సదరు సిబ్బందిని వెనకేసుకుకు రావడం విమర్శలకు తావిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జిల్లాలతోపాటు నగరం నలుమూలల నుంచి వేలాదిమంది రోగులు నిత్యం గాంధీ ఆస్పత్రి ఓపీ విభాగానికి వస్తుంటారు. రోగుల రద్దీకి అనుగుణంగా ఓపీ చిట్టీ కౌంటర్లు ఏర్పాటు చేయడంలో ఆస్పత్రి యంత్రాంగం విఫలం కావడంతో చిట్టీల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు ఓపీ చిట్టీలు ఇచ్చే సిబ్బందితో చేతులు కలిపి చిట్టీ రూ. 50 నుంచి 100 చొప్పున అమ్మకునేవారు.  ఈ ఓపీ చిట్టీల దందాను  ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో స్పందించిన ఉన్నతాధికారులు ఓపీ చిట్టీల కౌంటర్లకు తాళం వేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ మహిళ కాంట్రాక్టు ఉద్యోగి చిట్టీల కోసం వెళ్లిన వారితో దురుసుగా ప్రవర్తించింది. నేను ఇవ్వను పక్క కౌంటర్‌లో తీసుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గట్టిగా నిలదీయడంతో కంప్యూటర్‌ హ్యాంగ్‌ అయ్యిందంటూ తప్పించుకునేందుకు యత్నించింది. అదే సమయంలో తెలిసిన వ్యక్తి వచ్చి అడిగితే క్షణాల్లో ఓపీ చిట్టీ ఇచ్చింది. ఈ తతంగాన్నంతా సదరు వ్యక్తి వీడియో తీసి ఓపీ ఇన్‌చార్జి ఆర్‌ఎంఓ ప్రభుకిరణ్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఫిర్యాదు వినకుండానే కంప్యూటర్‌ హ్యాంగ్‌ అయ్యిందంటూ సదరు మహిళా ఉద్యోగిని వెనకేసుకురావడం గమనార్హం. తక్షణమే ఆస్పత్రి పాలనయంత్రాంగం స్పందించి చిట్టీల దందాను నివారించాలని, దందాలో ఆర్‌ఎంఓల  పాత్రపై సమగ్ర విచారణ చేపట్టాలని, రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై తగిన చర్యలు చేపట్టాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు