అప్‌డేట్స్‌: నగరంలో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర

12 Sep, 2019 07:40 IST|Sakshi

హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌ ద్వాదశ ఆదిత్య మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్‌ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు. ఈ సారి వినాయకుడు పూర్తిగా మునగటం విశేషం. మహాగణపతిని సాగనంపటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ట్యాంక్‌ బండ్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం కోలాహలంగా మారింది. ఎటువంటి ఆటంకం లేకుండా మహాగణపతి నిమజ్జనం పూర్తవడంతో భక్తులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఘనంగా నిమజ్జనం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆయన గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ....గణేష్‌ నిమజ‍్జనంలో పోలీసులు ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. శాంతి భద్రతలను పోలీసులు సవాల్‌గా తీసుకున్నారన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని దేశం మొత్తం చూస్తుందని,  లక్షల మంది భక్తులు ఆయనను దర్శించుకున్నారన్నారు.

  • తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీ గురువారం సాయంత్రం వినాయక నిమజ్జనం, శోభాయాత్రను హెలికాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు.
  • చార్మినార్ చేరుకున్న బాలాపూర్ గణనాధుడు
  • ఎంజే మార్కెట్‌ వద్ద శోభాయాత్రలో పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగత్‌

పాతబస్తీలో అపశ్రుతి
పాతబస్తీ బహుదూర్‌పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని క్రేన్‌తో లారీలో పెట్టె సమయంలో రవీందర్‌ అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ క్రేన్‌ మీద నుంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడి పరిస్థితి విషమంగా మారింది. అత్యవసర చికిత్స కోసం వెంటనే అతడిని నాంపల్లి కేర్‌ ఆసుపత్రికి తరలించారు. నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ మార్గ్‌ చేరుకున్న ఖైరతాబాద్‌ గణేశ్‌
ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర కొనసాగుతోంది. మరి కొద్దిసేపట్లో ఎన్టీఆర్‌ మార్గ్‌లో గణేశుని నిమజ్జనం జరగనుంది. ఇప్పటికే ఖైరతాబాద్‌ గణేశుడు ఎన్టీఆర్‌ మార్గ్‌ చేరుకున్నాడు. ఖైరతాబాద్‌ గణేశుని మహా నిమజ్జనానికి రెడీగా ప్రత్యేక క్రేన్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని వినాయక విగ్రహాలను ట్యాంక్‌ బండ్‌వైపు మళ్లిస్తున్నారు.


ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద ఖైరతాబాద్‌ గణేశుడు

బాలాపూర్ లడ్డు @ రూ. 17.60 లక్షలు
బాలాపూర్‌ వినాయకుడి లడ్డు వేలం ముగిసింది. ఈ సారి లడ్డు వేలంలో 28 మంది పాల్గొన్నారు. రూ. 17.60 లక్షలకు కొలను రాంరెడ్డి అనే భక్తుడు లడ్డును సొంతం చేసుకున్నాడు.

బాలాపూర్‌ లడ్డు

వర్షంలోనే గణనాథుల నిమజ్జనోత్సవం
గణనాథుల శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. వర్షంలోనే గణనాథుల నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. భక్తుల కోలాటాలు, నృత్యాల మధ్య వినాయకుల శోభాయాత్ర వైభవోపేతంగా జరుగుతోంది. శోభాయాత్ర సందడితో రహదారులన్ని కొత్త రూపు సంతరించుకున్నాయి.

వర్షంలోనే గణనాథుల నిమజ్జనోత్సవం

కదిలిన బాలాపూర్‌ గణేశుడు
బాలాపూర్‌ గణేశుని శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్ర అనంతరం లడ్డు వేలం పాట జరగనుంది. గతేడాది లడ్డు రూ. 16.60 లక్షలు పలికింది. దీంతో ఈ సంవత్సరం లడ్డు వేలం పాటపై సర్వత్రా ఆసక్తి  నెలకొంది.

బాలాపూర్ గణేశుడు

ప్రారంభమైన ఖైరతాబాద్‌ గణేశ్‌ శోభాయాత్ర
ఖైరతాబాద్‌ ద్వాదశ ఆదిత్య మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనం కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్రేన్ నెంబర్ 6 వద్ద జీహెచ్ఎంసీ అధికారులు భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఖైరతాబాద్‌ మహాగణపతి

సాక్షి, హైదరాబాద్‌ : జంట నగరాల్లో బొజ్జగణపయ్యల నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం 6 గంటల నుంచే వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఊరేగింపుగా బయలుదేరాయి. నగరంలోని వీధులన్నీ శోభయాత్ర వెలుగులను సంతరించుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు గణేశ్‌ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. కాగా, నగరవ్యాప్తంగా దాదాపు 391 కిలోమీటర్ల మేర నిమజ్జనోత్సవం జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  ఉండేందుకు అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు