12న గణేష్‌ శోభాయాత్ర

7 Sep, 2019 03:25 IST|Sakshi

ముఖ్య అతిథిగా ఆరెస్సెస్‌ చీఫ్‌ భాగవత్‌: గణేష్‌ ఉత్సవ సమితి 

బాలాపూర్‌ లడ్డూ వేలంతో యాత్ర ప్రారంభం  

సాక్షి, హైదరాబాద్‌: తొమ్మిది రోజుల పాటు కొలిచే గణనాథులకు ఘన వీడ్కోలు పలికేందుకు భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. 12వ తేదీ ఉదయం 8 గంటలకు బాలాపూర్‌ వినాయకుని లడ్డూ వేలంతో శోభాయాత్ర కార్యక్రమాలు మొదలుకానున్నాయి. ఈ సంవత్సరం శోభాయాత్రకు ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘ్‌ చాలక్‌ (చీఫ్‌) మోహన్‌ భాగవత్‌ హాజరుకానున్నారని, స్వామి ప్రజ్ఞానంద యాత్రలో పాల్గొంటారన్నారు. శుక్రవారం భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు మీడియాతో మాట్లాడుతూ.. 12వ తేదీ ఉదయం 8 గంటలకు బాలాపూర్‌ లడ్డూ వేలం తర్వాత శోభాయాత్ర ప్రారంభం అవుతుందని.. చాంద్రాయణగుట్ట, షాలిబండ, చార్మినార్‌ మీదుగా సాగుతుందని తెలిపారు. యాత్రలో డీజేలు, సినిమా పాటలు, వికృత డాన్సులు చేయరాదని సూచించారు.

దేశభక్తి, దైవభక్తి పెంపొందించేలా భజనలు, కీర్తనలు, హరికథలు, బుర్ర కథలు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్‌ వాడరాదని, స్వచ్ఛత, శుభ్రత పాటించాలని, మండపాల వద్ద గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు. సమితి ఆ«ధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఒక థీమ్‌ పెట్టుకుంటామని, ఈ యేడు జలియన్‌ వాలాబాగ్‌లో జరిగిన ఘటనను మననం చేసుకుంటూ ఊరేగింపు సాగాలన్నారు. ఊరేగింపులో గుర్తుతెలియని వ్యక్తులు ఏదైనా వదంతులు పుట్టిస్తే దాన్ని నమ్మరాదని సూచించారు. పోలీసులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు 40 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అన్నారు. 

వినాయక్‌సాగర్‌లో మహా హారతి..
కాశీ తరహాలో వినాయక్‌ సాగర్‌ (ట్యాంక్‌బండ్‌)లో కూడా మహా హారతి ఇవ్వాలని తాము ప్రతిపాదించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రాఘవరెడ్డి చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు పూర్తిగా సహకరిస్తున్నాయని, యాత్ర పొడువునా నీరు ఏర్పాటు చేసేందుకు వాటర్‌వర్క్స్, లైట్ల ఏర్పాటుకు విద్యుత్‌ సంస్థ సిద్ధమైనట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు