మహిళపై సామూహిక అత్యాచారం

24 Oct, 2017 03:32 IST|Sakshi

ఇద్దరు మహిళలను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించిన ముగ్గురు కామాంధులు

మధ్యలో కారులోంచి దూకి పారిపోయిన మరో మహిళ

హయత్‌నగర్‌(ఇబ్రహీంపట్నం): అర్ధరాత్రి బస్సు కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకుని తీసుకువెళ్తూ మధ్యలో అత్యాచారానికి యత్నించారు. వారి ప్రవర్తనను పసిగట్టిన ఓ మహిళ మార్గమధ్యలో కారులోంచి కిందికి దూకి పారిపోయిగా మరో మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ సంఘటన సోమవారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. చంపాపేట్‌కు చెందిన ఓ మహిళ(33) చీరల వ్యాపారి.

ఎల్‌బీనగర్‌ కామినేని ఆసుపత్రి సమీపంలో నివసించే మరో మహిళ(30)తో పరిచయం ఏర్పడింది. వీరు హయత్‌నగర్‌కు వెళ్లేందుకు దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా గుడి సమీపంలో బస్సు కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఓ కారులో వచ్చి హయత్‌నగర్‌లో దింపుతామని మహిళలను కారెక్కించుకున్నారు. మద్యం మత్తులో ఉన్న దుండగులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. హయత్‌నగర్‌ వద్ద కారును ఆపకుండా ముందుకు తీసుకెళ్లారు.

దీంతో ఓ మహిళ పెద్దంబర్‌పేట్‌ వద్ద కారులోంచి కిందికి దూకేసింది. దుండగులు మరో మహిళను ఔటర్‌ రింగ్‌రోడ్డు సర్వీస్‌రోడ్డు నుంచి గండిచెర్వు వైపు నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అటువైపుగా వచ్చిన పోలీసు వాహనం సైరన్‌ మోత విన్న కామాంధులు మహిళ వద్ద ఉన్న రూ.2 వేల నగదును, ఓ సెల్‌ఫోన్‌ను తీసుకుని పారిపోయారు. అక్కడి నుంచి రోడ్డుపైకి వచ్చిన బాధిత మహిళ ఓ డీసీఎం వ్యాను ఎక్కి ఇంటికి చేరుకుంది. అనంతరం కారుదూకి వెళ్లిన మహిళతో కలసి వచ్చి హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు