చూపు కోసం వస్తే.. ఉన్న చూపు పాయె..

14 Dec, 2014 02:19 IST|Sakshi
చూపు కోసం వస్తే.. ఉన్న చూపు పాయె..

ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి మరోసారి వివాదంలోకెక్కింది. కంటి చూపు కోసం వస్తే.. ఉన్న చూపును కోల్పోయింది ఓ వృద్ధురాలు. రిమ్స్‌లో మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. బజార్‌హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన 55 ఏళ్ల వృద్ధురాలు కె. గంగమ్మ కంటిచూపు సరిగా కనబడడం లేదని ఈ నెల 9న రిమ్స్ ఆస్పత్రికి వచ్చింది. కంటిపై పొర వచ్చిందని వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ అయినప్పటి నుంచి ఆమె అస్వస్థతకు గురవుతూ వచ్చింది. రెండు రోజుల పాటు వాంతులు, విరేచనాలు చేసుకుంది.

వాటిని ఎలాగొలా నయం చేశారు. కాగా, మూడో రోజు ఆపరేషన్ అయిన ఎడమ కంటి నుంచి చీమురావడం మొదలైంది. ఆందోళనకు గురైన వృద్ధురాలి బంధువులు సదరు వైద్యుడి వద్దకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటికొచ్చింది. కంటిచూపు పోయిందని, వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని వైద్యుడు బంధువులకు సూచించాడు. శనివారం ఆస్పత్రికి వచ్చిన వైద్యుడు వృద్ధురాలికి డిశ్చార్జి కార్డు రాసి పడకపై పెట్టి వెళ్లిపోయాడు.

విషయం తెలుసుకున్న బంధువులు తమకు న్యాయం చేయాలని, వైద్యుడి నిర్లక్ష్యంతోనే కంటి చూపు పోయిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రిమ్స్ సమీక్ష సమావేశానికి వచ్చిన మంత్రి జోగురామన్న, డీఎంఈ శ్రీనివాస్‌ను కలిసి విన్నవించారు. స్పందించిన మంత్రి, డీఏంఈలు దీనిపై పూర్తి విచారణ చేపట్టి, చూపుపోయిన గల కారణాలు తెలుసుకున్న తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోగికి హైదరాబాద్‌లో వైద్యం అందించేందుకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రైవేట్ క్లినిక్‌లో పరీక్షలు.. రిమ్స్‌లో ఆపరేషన్
ఆదిలాబాద్ పట్టణంలోని సదరు వైద్యుడి ప్రైవేట్ ఐ క్లినిక్‌కు గంగమ్మను డిసెంబర్ 4న కంటీ పరీక్షల కోసం తీసుకెళ్లామని ఆమె బంధువులు కళ, లక్ష్మి, జగన్నాథ్, సాయన్న పేర్కొన్నారు. అక్కడ పరీక్షలు చేసిన తర్వాత కంటి పొర వచ్చిందని రిమ్స్‌కు వస్తే ఆపరేషన్ చేస్తానని చెప్పడంతో రిమ్స్‌కు తీసుకొచ్చామని అన్నారు. రక్త పరీక్షలు చేసి అన్నీ సరిగా ఉన్నాయని తేలిన తర్వాతే మంగళవారం కంటి ఆపరేషన్ చేశారని తెలిపారు. ఆపరేషన్ అయినప్పటి నుంచి గంగమ్మ ఆరోగ్యం దెబ్బతిందన్నారు.

మూడు రోజుల సెలాయిన్‌లు పెడుతూ అక్కడి నర్సులు మాత్రమే పరిస్థితిని చూశారని, ఆపరేషన్ చేసిన వైద్యుడు మాత్రం రాలేదన్నారు. కంటి నుంచి చీము కారుతుందని ఆపరేషన్ చేసిన డాక్టర్ వినయ్‌కుమార్ క్లినిక్‌కు తామే స్వయంగా వెళ్లి అడిగితేనే అసలు విషయం చెప్పాడని పేర్కొన్నారు. మరో ఏదో జబ్బు ఉందని, రిమ్స్‌లోనే ఉంచితే ఇంకో కంటికి కూడా చూపు పోయే ప్రమాదం ఉందని, వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని చెప్పారని వివరించారు. అయితే కంటి ఆపరేషన్‌కు ముందు చూపు సరిగా ఉందని, ఆపరేషన్ తర్వాతే చూపు పోవడంతో పాటు ఇతర సమస్యలు ఏర్పడ్డాయని వారు పేర్కొన్నారు. సదరు వైద్యుడి నిర్లక్ష్యంతోనే కంటి చూపు పోయిందని వారు ఆరోపించారు. దీనికి కారణమైన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె బంధువులు డిమాండ్ చేశారు.

ఇక.. ఆ అవ్వకు దిక్కెవరు
కంటి చూపు కోల్పోయిన వృద్ధురాలు గంగమ్మకు భర్త, పిల్లలు లేరు. ఆమె ఒక్కరే కూలీనాలీ చేస్తూ జీవనం గడుపుతోంది. ఆమెకు కంటి పరీక్షలు చేయించేందుకు కూడా భర్త బంధువులు, మనవాళ్లు ఆస్పత్రికి తీసుకొచ్చారు. వీటికి సంబంధించి డబ్బులు కూడా వారే భరించారు. ప్రస్తుతం ఆమెకు కంటి చూపు పోవడంతో ఆ కాస్త కూలీ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఎలాగొలా జీవితం నెట్టొకొచ్చిన ఆమెకు ఈ సంఘటన జరగడంతో బంధువులపై ఆధారపడాల్సి వచ్చింది. కంటి చూపు కోసం నాణ్యమైన వైద్యం చేయించుకునేంత స్థోమత కూడా వృద్ధురాలికి లేదు. ప్రభుత్వం తనకు జరిగిన అన్యాయం చూసి వైద్యం అందించాలని ఆమె బంధువులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు