కేసీఆర్‌ గద్దె దిగక తప్పదు

21 Nov, 2018 13:09 IST|Sakshi
పలివెలలో మాట్లాడుతున్న మనోహర్‌రెడ్డి

గంగిడి మనోహర్‌రెడ్డి 

సాక్షి, మునుగోడు : గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా విస్మరించిన సీఎం కేసీఆర్‌ గద్దె దిగక తప్పదని బీజేపీ మునుగోడు అసెంబ్లీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని కిష్టాపురం, ఇప్పర్తి, పలివెల, కోతులారం తదితర గ్రామాలల్లో మంగళవారం తన కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు,, దళితులకు మూడు ఎకరాల భూమి, ప్రతి ఇంటికి ఉద్యోగం, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు, కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్య అందిస్తానని వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. హామీలను విస్మరించిన ఆ పార్టీ నాయకులకు నేడు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. తన కుటుంబాన్ని తప్పా రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్‌కు తగిన బుద్ధిచెప్పాలని అన్నారు.

దేశంలోని పేదరిక నిర్మూలనకు నిత్యం శ్రమిస్తున్న బీజేపీని గెలిపించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. వ్యాపారాలు తప్పా రాజకీయాలు తెలియని మహాకూటమి అభ్యర్థి సంతలో గొర్రెలను కొనుగోలు చేసినట్లు నాయకులను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. గతంలో ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేశాడో తెలియచేయాలని డిమాండ్‌ చేశారు. సినిమా డైలాగులతో ప్రజలని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. కానీ ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు. అధికార పార్టీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థికి కమీషన్లు తప్పా ప్రజల సమస్యలు పట్టవన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబాటుకు గురైన మునుగోడును ఏ పార్టీ ప్రజా ప్రతినిధి పట్టించుకోలేదన్నారు. కనీసం ప్రభుత్వ కళాశాలలు, ఆసుపత్రులు, ప్రతి గ్రామానికి సరైన రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేయించలేని ఆ ఇరువురు నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్‌ మంచుకొండ రాంమూర్తి, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వేదాంతం గోపినాథ్, మండల అధ్యక్షుడు బొడిగే అశోక్‌గౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సోమ నర్సింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూడల భిక్షంగౌడ్, రాష్ట్ర నాయకుడు భవనం మధుసూదన్‌రెడ్డి, నాయకులు నకిరకంటి నర్సింహ్మగౌడ్, బొల్గూరి రమేష్, కంభంపాటి నర్సింహ, దుబ్బ జెల్లయ్య, మాదగోని నరేందర్‌గౌడ్, గజ్జల బాలరాజుగౌడ్, నీరుడు రాజారాం, ఎర్రబెల్లి శంకర్‌రెడ్డి, సతీష్‌ పాల్గొన్నారు.  అదే విధంగా ఇప్పర్తి శివాలయంలో పూజలు చేశారు. 

మరిన్ని వార్తలు