మళ్లీ తెరపైకి నయీం అనుచరుల ఆగడాలు

10 Mar, 2019 12:00 IST|Sakshi
విచారణ చేసేందుకు వాహనంలో వచ్చిన పోలీసులు

సాక్షి, యాదాద్రి : గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ అనుచరుల ఆగడాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. వీరిని అదుపుచేయలేక పోతున్నారని భువనగిరిజోన్‌ డీసీపీ ఈ.రామచంద్రారెడ్డి, భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వెంకన్నపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ శనివారం సాయంత్రం హుటాహుటిన చర్యలు తీసుకున్నారు. కొందరు ఇటీవల సీఎం కార్యాలయంలో నయీమ్‌ అనుచరుల అగడాలు, పోలీ స్‌ల వైఖరిపై ఫిర్యాదు చేయడంతో మరోసారి అధికార యంత్రాంగం శాఖపరమైన చర్యలు ప్రారంభించింది.

ఇందులో భాగంగా డీసీపీ రామచంద్రారెడ్డిని రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. యూసుఫ్‌గూడ పీఎంటీ, పీఈటీ ఫస్ట్‌ బెటాలియన్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌కు రిపోర్టు చేసి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పూర్త య్యే వరకు పనిచేయాలని ఆదేశాలు జారీచేయగా, భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వెంకన్నగౌడ్‌ను రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్‌ చేసి ఆయన స్థానంలో భువనగిరి ట్రాíఫిక్‌–2 ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌కు బాధ్యతలు అప్పగించారు.

భువనగిరి శివారులో గల సర్వే నంబర్‌ 730లో 5.20 ఎకరాల భూమిని నయీమ్‌ అనుచరులైన పాశం శ్రీను, ఎండీ నాసర్‌లు భువనగిరి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇటీవల రిజిష్ట్రేషన్‌ చేయించారని సీపీకి అందిన ఫిర్యాదుపై విచారణ జరిపారు. సిట్‌ ఆదేశాలతో పోలీస్‌లపై వెంటనే చర్యలు తీసుకున్నారు. నయీమ్‌ అనుచరులపై భువగగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీస్‌ అధికారి అండదండలతోనే నయీ మ్‌ అనుచరుల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయన్న ఫిర్యాదుతోనే సీపీ సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. 

భువనగిరి కేంద్రంగా నేర సామ్రాజ్యాన్ని ప్రారంభించిన నయీం ప్రస్థానం 2016 ఆగస్టు 8న మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. ఎన్‌కౌంటర్‌ అనంతరం అతని ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. నేర సామ్రాజ్యంలో ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు ఇలా అన్ని వర్గాల ప్రాతినిధ్యం బయటపడింది. ప్రధానంగా భువనగిరి కేంద్రంగా నయీం, అతని అనుచరులు సాగించిన ఆకృత్యాలు, బలవంతపు వసూళ్లు, వ్యవసాయ భూములు, ఇళ్ల ప్లాట్ల బాధితులు పోలీసులు ముందుకు వచ్చారు. వారు ఇచ్చిన ఫిర్యాదులతో అప్పట్లో నయీమ్‌ అనుచరులపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపించారు. 

సిట్‌ ఏర్పాటు 
నయీంఎన్‌కౌంటర్‌తో వెలుగులోకి వచ్చిన వందలాది మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం సిట్‌ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాపితంగా 230కిపైగా సిట్‌ కేసులు నమోదు చేసింది. జిల్లాలో భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో 121, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో 25, యాదగిరిగుట్టలో 21, వలిగొండలో 4, చౌటుప్పల్‌లో 1 కేసు నమోదైంది. భువనగిరి పట్టణంలో సుమారు 50 బలవంతపు వసూళ్ల కేసులు కాగా, మిగతావన్నీ భూ కబ్జాల కేసులు నమెదయ్యాయి. 

టీచర్స్‌ కాలనీలో ప్లాట్ల కేసు 
భువనగిరి టీచర్స్‌ కాలనీ సమీపంలోని శ్రీ లక్ష్మినర్సింహస్వామి నగర్‌ ప్లాట్ల అక్రమణ కేసులో నయీం అనుచరులు, కుటుంబ సభ్యులపై 2016లో కేసు నమోదైంది. 1994లో భువనగిరి పట్టణ శివారు, బొమ్మాయిపల్లి శివారులోని సర్వేనంబర్లు 722, 723, 724, 726, 727, 728, 729, 730, 731, 732, 733లలో మూడు దశల్లో వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయించారు. 154 ఎకరాల భూమిలో 1756 ఓపెన్‌ ప్లాట్ల వెంచర్‌లో భువనగిరి, హైదరాబాద్‌ ఇతర ప్రాంతాలకు చెందిన వందలాది మంది ప్లాట్లు కొనుగోలు చేశారు.

2003– 2004 నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులకు తెలియకుండా నయీం, అతని అనుచరులు భూ యజమాని పట్టాదారు పాస్‌పుస్తకాలతో తమకు సంబంధించిన వ్యక్తుల పేరుమీద డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అనంతరం మరికొందరికి విక్రయించారు. ఈ విషయంలో 2010లో బాధితులు పెద్ద ఎత్తున భువనగిరిలో, హైదరాబాద్‌లో ఆందోళన చేశారు. కానీ నయీం అనుచరులు బెదిరించడంతో పాటు అధికారులనుంచి సరైన సహకారం లభించకపోవడంతో ఈ విషయం కాస్త అటకెక్కింది. నయీం ఎన్‌కౌంటర్‌ జరగడంతో బాధితులంతా తమ ప్లాట్లను తమకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. కేసు భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. 

పోలీస్‌లు కుమ్మక్కు అయ్యారా?
నయీమ్‌ అనుచరులతో పోలీస్‌లు కుమ్మక్కు అయయ్యారన్న ఆరోపణలపైనే సీపీ తీవ్రమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్న డీసీపీ రామచంద్రారెడ్డి జిల్లాలో విధుల్లో చేరిన నాటినుంచి రియల్‌ఎస్టేట్‌ సెటిల్‌మెంట్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకింది ఉద్యోగులు కొందరితో కలిసి ఇటీవల నయీమ్‌ అనుచరులకు భూ సెటిల్‌మెంట్లకు సహకరిస్తున్నాడన్న ఫిర్యాదులు అందాయి.

భువనగిరి శివారులోగల సర్వేనంబర్‌ 730లో ఎ5.20గుంటల భూమి అక్రమంగా ఇటీవల నయిమ్‌ అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్‌ నాసర్‌లు కలిసి భువనగిరి, బీబీనగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో నయీమ్‌కు సంబంధించిన బినామీ ఆస్తులను రిజిస్ట్రేషన్‌కు సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో బాధితులు సీపీని కలిసి తమను పోలీస్‌లు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదు చేయడంతో ఆయన సిట్‌ విచారణకు ఆదేశించారు. దీంతో శనివారం సిట్‌ అధికారులు భువనగిరి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జిల్లా రిజిస్ట్రార్‌తోపాటు సబ్‌ రిజిస్ట్రార్‌లను విచారించారు. పాశం శ్రీను, అబ్దుల్‌నాసర్‌లతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.  

>
మరిన్ని వార్తలు