నాలుగేళ్ల వరకు రాజకీయాల గురించి మాట్లాడం

27 Jan, 2020 19:14 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: జిల్లా కార్పొరేషన్‌ ఫలితాలు మంత్రి కేటీఆర్‌ పనితీరుకు నిదర్శనమని పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎవరితో పొత్తు లేకుండా ఏకపక్షంగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవిని కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. కరీంనగర్‌లో ఈ నెల 24న మున్సిపల్‌ ఎన్నికలు జరగగా సోమవారం సాయంత్రం ఫలితాలు వెలువడ్డాయి. కరీంనగర్‌లోని 60 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ 34 స్థానాలు కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యత కనబర్చింది. టీఆర్‌ఎస్‌ గెలుపు సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రేపటి నుంచే అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ఇప్పుడిక ఏ ఎన్నికలు లేవని, నాలుగేళ్ల వరకు రాజకీయాల గురించి మాట్లాడమని తెలిపారు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామన్నారు. 2023లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటేనని చెప్పడానికి కాంగ్రెస్‌కు ఒక్క స్థానం రాకపోవడమే నిదర్శనమని ఎద్దేవా చేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి కొన్ని ఓట్లు పొందిన బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. ఇక మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎవరనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయిస్తారని, సీల్డ్‌ కవర్‌లో ఎవరి పేరు వస్తే వారే పదవి చేపడతారని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

చదవండి: కరీంనగర్‌లో పత్తా లేని కాంగ్రెస్‌

మంత్రి గంగుల ఉదంతాన్ని పరిశీలిస్తాం.. 

మరిన్ని వార్తలు