గిట్టుబాటే లక్ష్యం : మంత్రి గంగుల

13 Sep, 2019 02:15 IST|Sakshi

కాళేశ్వరంతో ధాన్యం దిగుబడులు పెరుగుతాయ్‌ ‘సాక్షి’తో మంత్రి గంగుల కమలాకర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో సాగునీటి వన రుల కల్పన పెరిగింది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో ప్రభు త్వం పూర్తి చేస్తోంది. కాల్వలు, చెరువుల కింద గరిష్ట నీటి వినియోగం జరుగుతుండటంతో వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అందుకు తగ్గట్లే ధాన్యం సేకరణ చేయాల్సి ఉంది. ఈ ఖరీఫ్‌ నుంచే 50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దానికి తగినట్టే రైతుల నుంచి సేకరించే గింజ గింజకూ మద్దతు ధర దక్కేలా చూడటమే మా ముందున్న తొలి ప్రాధాన్యం’ అని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ఈ రెండు శాఖలను సీఎం కేసీఆర్‌ తనకు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కమలాకర్‌ గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

సివిల్‌ సప్లయ్స్‌ శాఖ ప్రక్షాళన... 
పౌరసరఫరాల శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం. రెండు, మూడు రోజుల్లోనే సమీక్షా సమావేశం నిర్వహించి ప్రాధాన్యతాంశాలపై చర్యలు చేపడతాం. ఏమాత్రం అవినీతికి ఆస్కారం లేని విధంగా పేదలకు బియ్యం, ఇతర నిత్యావసరాల సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం.  

బీసీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం 
రాష్ట్రంలోని బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ వర్గాలకు పూర్తి న్యాయం చేసేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతోపాటు వెనుకబడిన వర్గాలకు వివిధ సంక్షేమ పథకాల అమలుకు చర్యలు చేపడతాం. బీసీ వర్గాల్లో అనందం కలిగించే ధ్యేయంతో పనిచేస్తాం.  

ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికలు
రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడు భూములకు సాగునీరు చేరి వరి సాగు పెరగనుంది. ఫలితంగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ధాన్యం సేకరణ, ఇతర అంశాలకు సంబంధించి ప్రభుత్వం–మిల్లర్ల మధ్య పూర్తిస్థాయిలో పరస్పర సహకారం ఉండేలా చూస్తాం. ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. 

మరిన్ని వార్తలు