కరీంనగరే దిక్సూచి: మంత్రి గంగుల

11 Apr, 2020 08:25 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కరోనా కట్టడిలో కరీంనగర్‌ దేశానికే మార్గదర్శిగా నిలిచింది. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కృషి... పోలీస్, వైద్యారోగ్య, మునిసిపల్‌ సిబ్బంది సేవలు...  ప్రజల స్ఫూర్తివంతమైన క్రమశిక్షణ కరీంనగర్‌కు అరుదైన గౌరవం తీసుకొచి్చంది. 20 రోజుల క్రితమే కరీంనగర్‌కు వచ్చిన 10 మంది ఇండోనేసియన్లకు కరోనా వ్యాధి సోకగా... ఆరోజు నుంచే కరీంనగర్‌లో ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇండోనేసియన్లు బస చేసిన ప్రాంతాలు, పర్యటించిన ఏరియాలను రెడ్‌జోన్‌లుగా గుర్తించి కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో జిల్లా మంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్, మేయర్‌ వై.సునీల్‌రావు చూపించిన స్ఫూర్తి వంతమైన నాయకత్వం... కలెక్టర్‌ శశాంక, పోలీస్‌ కమిషనర్‌ వీబీ. కమలాసన్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి కృషి, ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటించడంలో ప్రజలు చూపించిన విజ్ఞతతో కరీంనగర్‌లో వైరస్‌ వ్యాప్తి చెందలేదు. (సినీనటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత )

ఇండోనేసియన్లు 10 మంది, వారి ద్వారా నలుగురికి వ్యాధి సోకినా కఠిన ఆంక్షలతో వైరస్‌ చైన్‌ తెగిపోయి ఇతరులకు సోకలేదు. ఆ తరువాత కరీంనగర్‌ జిల్లా నుంచి మర్కజ్‌కు వెళ్లొచ్చిన 19 మందిలో కశ్మీర్‌గడ్డ ప్రాంతంలోని ఒక యువకునికి, హుజూరాబాద్‌లోని ఇద్దరికి పాజిటివ్‌ సోకింది. హుజూరాబాద్‌లో పాజిటివ్‌ వచ్చిన ఒక వ్యక్తి సోదరునికి తరువాత వ్యాప్తి చెందింది. కరీంనగర్‌ జిల్లాలో 18 మందికి వైరస్‌ సోకగా, వారిలో 10 మంది ఇండోనేసియన్లతోపాటు మరొకరు కోలుకుని డిస్చార్జి అయ్యారు. ఏడుగురు చికిత్స పొందుతున్నారు. కాగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం చేసిన కృషి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. కరీంనగర్‌ స్ఫూర్తితో వైరస్‌ పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు నివసించిన ప్రాంతాలను కంటైన్మెంట్‌ క్లస్టర్లు (హాట్‌స్పాట్‌లు)గా ప్రకటించి, ఇతర ప్రాంతాలతో సంబంధాలను తెగగొడుతున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలతోపాటు “కరీంనగర్‌ మోడల్‌’ పేరిట నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు. (భార్యతో సైకిల్‌పై 120 కిలోమీటర్లు.. )

ఇండోనేసియన్లతో మొదలై... ఇప్పటిదాకా...
దేశంలో కరోనా జాడలు అప్పుడప్పుడే కనిపిస్తున్న రోజుల్లో  కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేసియన్లకు మార్చి 16న కరోనా లక్షణాలు కనిపించాయి. వారిని పరీక్షల కోసం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి పంపించగా... 17వ తేదీన ఒకరికి పాజిటివ్‌గా తేలింది. 18వ తేదీ నాటికి ఆ సంఖ్య 8కి చేరింది. కరీంనగర్‌ ముకరంపురాలో బస చేసిన ఇండోనేసియన్లకు పాజిటివ్‌ వచ్చిన విషయం తెలియగానే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హుటాహుటిన స్పందించారు. హైదరాబాద్‌లో ఉన్న స్థానిక మంత్రి గంగుల కమలాకర్‌ను తక్షణమే కరీంనగర్‌ వెళ్లి పరిస్థితిని అదుపు చేసే బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు 18న కరీంనగర్‌ వచ్చిన మంత్రి అదేరోజు రాత్రి మేయర్‌ సునీల్‌రావు, కలెక్టర్‌ శశాంక, కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, కమిషనర్‌ క్రాంతి, డీఎంహెచ్‌వో సుజాతతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

19వ తేదీన ఉదయమే ఇండోనేసియన్లు సంచరించిన ప్రాంతాలను పరిశీలించి రెడ్‌జోన్‌గా ప్రకటించారు. బ్యారికేడ్లతో ముకరంపురా, కశ్మీర్‌గడ్డ, కలెక్టరేట్‌ రోడ్లను దిగ్బంధం చేశారు. 22న జనతా కర్ఫూ్యకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునివ్వడానికి ముందే 19వ తేదీ నుంచే ఈ ప్రాంతాలతోపాటు కరీంనగర్‌లోని ప్రధాన రోడ్లలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. 24వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో ఇండోనేసియన్లు పర్యటించిన ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. ఆ ప్రాంతాల్లో నివసించే సుమారు 4,500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను, కూరగాయలను కార్పొరేషన్‌ ద్వారానే అందించే ఏర్పాట్లు చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఇదంతా సాగింది. 

వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట
కరీంనగర్‌లో తొలుత 8 మంది ఇండోనేసియన్లకు.... తరువాత మిగతా ఇద్దరికి వారి వల్ల మరో ముగ్గురికి వైరస్‌ సోకడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. మార్చి 20వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 19 కేసులు నమోదైతే అందులో 10 కరీంనగర్‌లోనే ఉండడంతో ప్రైమరీ కాంటాక్టుల ద్వారా ఎంతగా విజృంభిస్తుందోనని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కరీంనగర్‌ పేరు వింటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సామాజిక దూరం, ఇళ్ల నుంచి బయటకు రాకుండా లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా పాటించడంతో వైరస్‌ వ్యాప్తి చెందలేదు. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగంతోపాటు ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లాలో ఇండోనేసియా, మర్కజ్‌ కేసులు కలిపి 18కే పరిమితం కాగా, కరీంనగర్‌ తరువాత వైరస్‌ వ్యాప్తి చెందిన జిల్లాల్లో రోజురోజుకు కేసులు పెరుగుతుండడం గమనార్హం. కాగా, కరీంనగర్‌  ప్రభుత్వ ఆసుపత్రి, చల్మెడ ఆనందరావ వైద్య కళాశాల, శాతవాహన యూనివర్సిటీలలోని క్వారంటైన్‌లలో ఉన్న వందలాది మందిని కూడా సమయం పూర్తయి పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో దశలవారీగా ఇళ్లకు పంపిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని సమయం పూర్తయ్యే వరకు నిబద్ధతతో ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. 

జిల్లాలో కరోనా అప్‌డేట్స్‌
► ఏప్రిల్‌10వరకు సేకరించిన నమూనాలు–61
► కరోనా నెగిటివ్‌ ఫలితాలు –57 
► ఫలితాలు రావాలి్సనవి – 3
► నమోదైన పాజిటివ్‌ కేసులు –2 (పాతవి)
► పాజిటివ్‌ కేసులు డిశ్చార్జి సంఖ్య – 0
► ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారు–168
► హోం క్వారంటైన్‌లో ఉన్నవారు–75
►హోంక్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వారి సంఖ్య – 185
►  విదేశాల నుంచి వచ్చి 
► వైద్యసేవలు పొందుతున్న వారు – 0
► స్పెషల్‌ క్వారంటైన్‌ (ఆసుపత్రి)లో ఉన్నవారి సంఖ్య–9
►  సుల్తానాబాద్‌ ఐసోలేషన్‌లో–3
► పెద్దపల్లి ఐసోలేషన్‌ –6 మంది ఉన్నారు..

ప్రజల సహకారం మరువలేనిది.. 
ప్రజల సహకారంతోనే కరీంనగర్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో విజయం సాధిస్తున్నాం. ఇండోనేసియన్లు, మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి ద్వారా కరోనా కేసులు నమోదైనప్పటికీ, వైరస్‌ ఇతరులకు సోకకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో అందరూ తోడ్పడుతున్నారు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు కలెక్టర్, పోలీస్‌ కమిషనర్, డీఎంహెచ్‌వో, మునిసిపల్‌ కమిషనర్‌ ఇతర అధికారులంతా సమష్టిగా కరోనాను అడ్డుకోవడంలో సఫలీకృతమయ్యారు. ఇది పరీక్షా సమయం. ఈ స్ఫూర్తి కొనసాగించాలి. క్వారంటైన్‌లలో ఉన్న వారిని కూడా ఇళ్లకు పంపిస్తున్నాం. హోం క్వారంటైన్‌ను కొనసాగించాలని కోరుతున్నాం.
– గంగుల కమలాకర్, బీసీ సంక్షేమశాఖ మంత్రి 

మరిన్ని వార్తలు