అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా

1 Oct, 2019 10:16 IST|Sakshi
ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌ , వేదికపై బీసీ కుల సంఘాల నాయకులు

బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తా 

నమ్మకాన్ని  వమ్ము చేయను

ఆత్మీయ సన్మానంలో మంత్రి గంగుల కమలాకర్‌

సాక్షి, కరీంనగర్‌: ‘అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తాను... తప్పు చేయాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటా... మనిషిని మారను... మాట మారదు.. ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటా’ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గంగుల మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా బీసీ కులాల ఐక్యవేదిక కన్వీనర్‌ మెతుకు సత్యం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ పద్మనాయక కల్యాణమండపంలో సోమవాం నిర్వహించారు. సభ ప్రాంగణానికి మంత్రి గంగుల రాగానే వేదమంత్రాలు, పూర్ణకుంభం స్వాగతం పలికారు. ప్రధాన ద్వారం నుంచి మేళతాళాలతో లోనికి తీసుకొచ్చారు. బీసీ కుల సంఘాల ప్రతి నిధులు, సభ్యులు మంత్రి గంగుల కమలాకర్‌పై అభిమాన పూలజల్లు కురిపించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో బడుగులకు బాసటగా నిలిచింది కేవలం టీఆర్‌ఎస్‌ సర్కారేనని పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు హైదరాబాద్‌లో 45 కుల సంఘాలకు 85 ఎకరాల భూమి కేటాయిస్తూ రూ.85 కోట్లు విడుదల చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కార్‌దేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బీసీ గురుకులాలను ఏర్పాటు చేసి  98 వేల మంది బీసీ బిడ్డలకు చదువుకునే అవకాశం కల్పించారని అన్నారు. విదేశాలకు వెళ్లి చదివేందుకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం కింద సంక్షేమ శాఖ నుంచి విదేశీ విద్యా నిధి పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. వెనుకబడ్డ కులాల బిడ్డగా పుట్టడం తన అదృష్టమన్నారు. నమ్ముకున్న వారికి ఎళ్లవేళలా అండగా ఉంటానని ఎవరికీ మచ్చ తీసుకురా కుండా పని చేస్తానని హమీ ఇచ్చారు. గంగుల కమలాకర్‌ ఒక వ్యక్తి కాదని, వెనుకబడ్డ కులాల శక్తి తనకు అండగా ఉందని అన్నారు.

ప్రజల కోసం చేసిన అభివృద్ధి పనులే వరుసగా మూడుసార్లు గెలిపించాయని ప్రజల అభివృద్ధికి సర్వదా కట్టుబడి ఉంటానని చెప్పారు. కరీంనగర్‌ బిడ్డలకు ఉపాధి కల్పించేందుకు ఐటీ టవర్‌ నిర్మిస్తున్నామని, పర్యాటకంగా అభివృద్ధి చేసేం దుకు కేబుల్‌ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యా యని, భవిష్యత్తులో మానేరురివర్‌ ఫ్రంట్‌ కూడా నిర్మిస్తామని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి త్వరలోనే వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసి అన్ని విషయాలు సమగ్రంగా చర్చిస్తామని ప్రకటిం చారు. సన్మాన కార్యక్రమంలో ఎల్లాపి సంఘం ప్రతినిధి గణేశ్‌బాబు, గౌడ సంఘం ప్రతినిధి కోడూరి సత్యనారాయణగౌడ్, పూలే బీసీ సంఘం ప్రతినిధి రాచకోండ సత్యనారాయణ, పద్మశాలి సంఘం ప్రతినిధి దూడం లక్ష్మీరాజం, రజక సంఘం ప్రతినిధి దుడ్డెల శ్రీధర్, యాదవ సంఘం ప్రతినిధి గొర్రె అయిలేష్‌ యాదవ్, గంగుపుత్ర సంఘం ప్రతినిధి చేతి ధర్మయ్య,గంగాధర కనుకయ్య, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, చల్ల హరిశంకర్, బండారి వేణు, బోనాల శ్రీకాంత్, గందె మహేశ్, సింహరాజు కోదండరాములు, మంద నగేశ్, శ్రీధర్‌రాజు, నీలం మొండయ్య, జయరాం, జక్కం సంపత్, పెండ్యాల మహేశ్‌కుమార్, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు