‘బండ’పై బాదుడు

12 Nov, 2019 07:21 IST|Sakshi

గ్యాస్‌ సిలిండర్‌పై అదనపు వసూళ్లు  

నిర్ణీత ధర కంటే ఎక్కువ తీసుకుంటున్న డెలివరీ బాయ్స్‌  

ఒక్కో దానిపై రూ.25 నుంచి రూ.30  

డిస్ట్రిబ్యూటర్ల నిర్లక్ష్య వైఖరితో వినియోగదారుల జేబులకు చిల్లు 

సాక్షి, సిటీబ్యూరో: గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ బాయ్స్‌ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. గ్రేటర్‌లో డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.733.50. ఇది బిల్లుపై సైతం స్పష్టంగా ఉంటుంది. కానీ సిలిండర్‌ను డోర్‌ డెలివరీ చేసే బాయ్స్‌ మాత్రం వినియోగదారుల నుంచి రూ.760 వసూలు చేస్తున్నారు. అంటే ఇది నిర్ణీత ధర కంటే రూ.26.50 అదనం. దీంతో వినియోగదారులు నిండా మునుగుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ల నిర్లక్ష్య వైఖరితోనే ఈ పరిస్థితి తలెత్తింది. గ్యాస్‌ ధర, పన్నులు, డోర్‌ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ) తదితర కలుపుకొనే డిస్ట్రిబ్యూటర్లు బిల్లింగ్‌ చేసి, వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే చమురు సంస్థలు నిర్దేశించిన ధరనే బిల్లింగ్‌ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు సరఫరా భారాన్ని డెలివరీ బాయ్స్‌పై పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు ఏజెన్సీలు వారికి కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. కొందరు నామమాత్రంగా వేతనాలు ఇస్తుండగా, మరికొందరు సిలిండర్‌ డెలివరీపై కమీషన్‌ అందజేస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్‌ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం బాయ్స్‌ డెలివరీ సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్‌ నిర్ణీత బరువు పరిమాణాన్ని కూడా వినియోగాదారులకు చూపించాలి. 

నిబంధనలివీ...  
ఆన్‌లైన్‌లో ఎల్పీజీ సిలిండర్‌ను బుక్‌ చేసుకున్న అనంతరం బిల్‌ జనరేట్‌ అయిన తర్వాత డోర్‌ డెలివరీ చేయాలి.  
ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా డోర్‌ డెలివరీ చేయాలి.  6–15 కిలోమీటర్ల దూరం ఉంటే రవాణ చార్జీలకు గాను రూ.10 వసూలు చేయాలి. 16–30 కిలోమీటర్ల దూరం ఉంటే  రూ.15 తీసుకోవాలి.  
ఒకవేళ వినియోగదారుడు గ్యాస్‌ గోదాముకు వెళ్లి సిలిండర్‌ తీసుకుంటే బిల్లులో రూ.8 తగ్గించాల్సి ఉంటుంది.  

గ్రేటర్‌లో ఇదీ లెక్క
వంటగ్యాస్‌ వినియోగదారులు    26.80 లక్షలు
ఎల్పీజీ గ్యాస్‌ ఏజెన్సీలు    115
ప్రతిరోజు బుకింగ్‌    90వేలు
ప్రతిరోజు సరఫరా    60వేలు
డెలివరీ బాయ్స్‌    1250మంది 

మరిన్ని వార్తలు