గ్యాస్‌ ట్రబుల్స్‌!

30 Mar, 2020 08:34 IST|Sakshi

సిటీలో వంటగ్యాస్‌ కొరత లాక్‌ డౌన్‌తో తగ్గిన సరఫరా

భారీగా పెరిగిన వినియోగం పెరుగుతున్న బుకింగ్‌లు

బిల్లు జనరేటర్‌ అవుతున్నా...సరఫరా కానీ సిలిండర్‌

ఏజెన్సీల ముందు వినియోగదారుల బారులు  

సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సిటీలో వంట గ్యాస్‌ కొరత ఏర్పడింది. రోజురోజుకు బుకింగ్‌లు పెరుగుతుండడంతో పెండెన్సీ పెద్ద సంఖ్యకు చేరింది. కుటుంబ సభ్యులందరూ ఇంటి గడప దాటక పోవడంతో గృహాల్లో వంటగ్యాస్‌ వినియోగం భారీగా పెరుగుతున్నది. ఫలితంగా ముందు జాగ్రత్తగా గ్యాస్‌ బుకింగ్‌లు పెద్దఎత్తున చేస్తున్నారు. మరోవైపు లాక్‌ డౌన్‌ నేపథ్యంలో డెలివరీ బాయ్స్‌ లేక కూడా గ్యాస్‌ సరఫరా తగ్గుముఖం పట్టింది. ఆన్‌లైన్‌లో గ్యాస్‌ బుకింగ్‌ చేయగానే మొబైల్‌ లకు బుకింగ్, మరుసటి రోజు బిల్లు జనరేట్, త్వరలో సిలిండర్‌ డెలివరీ జరుగుతుందని సంక్షిప్త సమాచారం వస్తుందే తప్ప.. డోర్‌ డెలివరీ మాత్రం పత్తా లేక పోవడంతో  వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డబుల్‌ సిలిండర్‌ వినియోగదారులు కొంత వేచి చూస్తుండగా,  సింగిల్‌ సిలిండర్‌ వినియోగదారుల పరిస్ధితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక చేసేది లేక వంటగ్యాస్‌ వినియోగదారులు ఖాళీ సిలిండర్‌తో ఏజెన్సీ, గోదాములకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల నగరంలోని టోలిచౌకితో పాటు పాతబస్తీలోని డబీర్‌పురాలో కూడా వినియోగదారులు ఏజెన్సీల ముందు బారులు తీరారు. 

కనెక్షన్లు ఇలా..
గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌–రంగారెడ్డి–మేడ్చల్‌ జిల్లాలో ప్రధాన చుమురు సంస్ధలకు చెందిన సుమారు 28 లక్షల వరకు గృహోపయోగ వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, వినియోగంలో మాత్రం 26.21 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 60 శాతం వరకు సింగిల్‌ సిలిండర్‌ కనెక్షన్లు, మిగితా 40 శాతం డబుల్‌ సిలిండర్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజు మూడు ప్రధాన కంపెనీలకు చెందిన సుమారు 80 వేల సిలిండర్లు వినియోగదారులకు సరఫరా జరుగుతాయి. వాస్తవంగా ఒక్కో కంపెనీకి చెందిన ఎల్పీజీ బాట్లింగ్‌ యూనిట్‌లో ప్రతిరోజు సుమారు 60 వేల సిలిండర్‌ల చొప్పున రీఫిల్‌ జరిగితే అందులో సగం సిలిండర్లు డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా అవుతాయి. డిస్ట్రిబ్యూటర్లు సిలిండర్‌ బుకింగ్‌ ఆధారంగా రెండు మూడు రోజుల్లో డెలివరీ చేస్తూ వస్తున్నారు. తాజాగా లాక్‌డౌన్‌ ఫలితంగా చమురు సంస్ధల యూనిట్స్‌లలో రీఫిలింగ్‌ కూడా తగ్గు ముఖం పట్టినట్లు తెలుస్తోంది. బాయ్స్‌ కొరతతో వినియోగదారులకు సరఫరా మొక్కుబడిగా సాగుతుండటంతో గోదాముల్లో సిలిండర్ల నిల్వలు తగ్గిన పరిస్థితి నెలకొంది. 

పెండింగ్‌ కాల్స్‌ పైపైకి..
నగరంలో మూడు ప్రధాన చమురు సంస్థలకు వంట గ్యాస్‌ పెండింగ్‌ కాల్స్‌ జాబితా రోజురోజుకు పైపైకి ఎగబాగుతూనే ఉంది. గత వారంలో రోజుల్లో ఒక్కో చమురు సంస్థకు రెండు లక్షలకు పైగా బుకింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. వంట గ్యాస్‌ వినియోగం పెరగడంతో పాటు లాక్‌ డౌన్‌ ఇంకా కొనసాగితే.. కొరత ఏర్పడుతుందే మోనన్న భయంతో అవసరం లేకున్నా కొందరు ముందస్తుగానే బుక్‌ చేసుకోవడం, మరి కొందరు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముందస్తుగా ఒక సిలిండర్‌ను అందుబాటులో ఉంచుకునేందుకు ప్రయత్నించడంతో కాల్స్‌పెరిగి పోయినట్లు తెలుస్తోంది. అయితే అనవసర బుకింగ్‌ను కట్టడి చేసేందుకు 14 రోజుల వ్యవధికి నిబంధను అమలు చేసేందుకు చమురు సంస్ధలు సిద్దమైనట్లు తెలుస్తోంది.

కొరత లేదు...ఆందోళన వద్దు 
కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎమర్జెన్సీ సర్వీసుల కింద వంటగ్యాస్‌ సరఫరా జరుగుతుంది. వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదు. వినియోగదారులు ఆందోళన చెందవద్దు. అవసరం ఉంటేనే సిలిండర్లు బుక్‌ చేసుకోవాలి. సోషల్‌ డిస్టెన్స్‌లో భాగంగా వినియోగదారులు, అపార్ట్‌మెంట్‌ వాసులు, గేటెడ్‌ కమ్యూనిటీ వర్గాలు డెలివరీ బాయ్స్‌కు సహకరించాలి.  – అశోక్‌ కుమార్, అధ్యక్షుడు, వంటగ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు