తూ.కొ...మేలుకో

9 May, 2014 04:30 IST|Sakshi
తూ.కొ...మేలుకో

    ఆగని పెట్రోల్‌బంకుల మోసాలు
     దర్జాగా పంపింగ్‌లో మోసం
     లీటర్‌కు 10 ఎంఎల్ స్వాహా
     కేసులకు భయపడని డీలర్లు
     పట్టింపులేని తూ.కొ.శాఖ అధికారులు  

 
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో పెట్రోలు, డీజిల్ బంకుల మోసాలకు అడ్డుకట్టపడటం లేదు. మోసాలు జరుగుతున్నాయని మొత్తుకుంటున్నా యంత్రాంగం స్పందించడం లేదు. ప్రభుత్వ లోపభూయిష్ట చట్టాలతో పెట్రోలుబంకుల డీలర్ల దోపిడీ దర్జాగా సాగుతోంది. హైదరాబాద్‌లో పెట్రోలుబంకుల మహా మోసాలు కళ్లముందు కదలాడుతున్నా..కనీసం పట్టని తూనికల,కొలతల శాఖ తిమింగలాలను వదిలి.. చేపలను పట్టేలా ఇటీవల స్పెషల్‌డ్రైవ్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లోని బంకులను తనిఖీలు నిర్వహించడం విస్మయానికి గురిచేస్తోంది.

మహానగరం పరిధిలో సుమారు 300కు పైగా పెట్రోలు, డీజిల్ బంకులు ఉండగా, ఇటీవల స్పెషల్‌డ్రైవ్‌లో కనీసం పదిశాతం బంకులను కూడా తనిఖీలు నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నాలుగైదు ప్రాంతాల్లో కొన్ని బంకులను మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించగా..అంబర్‌పేటలోని ఐవోసీ పెట్రోల్‌బంకుపై మాత్రమే ఒక కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో పెట్రోలు బంకుల డీలర్లకు కనీసం భయం లేకుండాపోయింది.
 
వినియోగంలో మనమే టాప్ : రాష్ట్రంలోనే పెట్రోలు, డీజిల్ వినియోగంలో నగరం వాటా సగానికి పైనే. ప్రతిరోజు మహానగరంలో సగటున 30 లక్షల లీటర్ల పెట్రోలు, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది. బంకుల్లో సగటున ప్రతి లీటరుకు 10 నుంచి 15 ఎంఎల్ వరకు తక్కువగా పంపింగ్ జరగడం సర్వసాధరణమే. ఈ నగ్నసత్యాన్ని సంబంధిత అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు. ఇలా 10ఎంల్ చొప్పున తక్కువ పంపింగ్ జరిగినా.. ప్రతిరోజు 3వేల లీటర్ల పెట్రోలు, 3300 లీటర్ల డీజిల్ దోపీడీ జరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం లెక్కకడితే నిత్యం కోట్లాదిరూపాయలు వినియోగదారులు నష్టపోతున్నారు.  
 
భయపడని డీలర్లు : పెట్రోలు బంకుల డీలర్లు ఎలాంటి భయం లేకుండా దర్జాగా దోపిడీ పర్వం కొనసాగిస్తున్నారు. కొన్నినెలల క్రితం ఎస్‌వోటీ పోలీసులు, తూనికలకొలతలశాఖ ఫ్లైయింగ్‌స్క్వాడ్‌లు వేర్వేరుగా నిర్వహించిన తనిఖీల్లో పెట్రోల్ బంకుల నయా వంచనలు బహిర్గతం కావడం పాఠకులకు తెలిసిందే.

కొందరు బంకుల యజమానులు ఫిల్లింగ్ మిషన్ల సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక  చిప్‌లు పెట్టి రిమోట్ ద్వారా కంట్రోల్ చేస్తూ మీటర్ రీడింగ్‌ను జంపింగ్ చేస్తున్నట్లు బయటపడగా, మరికొందరు ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన రిమోట్ కంట్రోల్ ద్వారా పంపింగ్‌ను కంట్రోల్ చేస్తూ దోపిడీ చేయడం సంచలనం సృష్టించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

కేవలం ఆయిల్ కంపెనీలు సరఫరా చేసిన ఫిల్లింగ్ మిషన్ మోడల్‌ను తప్పుపట్టి హడావుడి సృష్టించి నోటీసులు జారీ చేసిన  తూ.కొ.శాఖ అధికారులు కేసులు నమోదు చేసి కాంపౌండింగ్‌తో సరిపెట్టారు. ఆ తర్వాత అధికారులు పట్టించుకోకపోవడంతో ఏదొక తరహాలో మోసాల తంతు సాగుతూనే ఉంది.
 
క్రిమినల్ కేసులే పరిష్కారం: పెట్రోల్‌బంకుల్లో మోసాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తే తప్ప అడ్డుకట్ట పడదని వినియోగదారులు పేర్కొంటున్నారు. నిత్యం బంకుల దోపిడీ కోట్లలో జరుగుతుంటే జరిమానాలు వేలల్లో విధిస్తే లాభం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తూనికల,కొలతలశాఖ చట్టాలను సవరించి కేసులను కోర్టుకు నివేదించి బాధ్యులను జైళ్లకు పంపితే తప్ప మోసాలు పునరావృతం కావని వారు అభిప్రాయపడుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు