గ్యాస్ సబ్సిడీ గందరగోళం

23 Mar, 2016 03:21 IST|Sakshi
గ్యాస్ సబ్సిడీ గందరగోళం

ఫినో ఖాతాలో జమ
వినియోగదారులకు అందనివైనం
సాంకేతిక సమస్య పేరిట దాటవేత

 
కరీంనగర్ రూరల్ : వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బు వినియోగదారులకు అందడంలేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం, ఫినో కంపెనీ దాటవేత వైఖరితో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవైసీలో బ్యాంకు ఖాతాల నంబర్లతో వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నా సబ్సిడీ డబ్బును వారి ఖాతాల్లో కాకుండా ఫినో కంపెనీ ఖాతాలో జమచేస్తున్నారు. సబ్సిడీ డబ్బుల కోసం వినియోగదారులు ఫినో కంపెనీ ప్రతినిధుల చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నా.. సాంకేతిక సమస్య సాకుతో తప్పించుకుంటున్నారు.

కరీంనగర్ మండలంలోని పలు గ్రామాలకు భారత్ గ్యాస్‌ను శివ థియేటర్ సమీపంలోని ఓంసాయిరాం గ్యాస్ ఏజెన్సీ సరఫరా చేస్తోంది. గతంలో గ్యాస్ సిలిండర్‌ను సబ్సిడీ మినహాయించి వినియోగదారులకు సరఫరా చేసేవారు. గతేడాదినుంచి కేంద్రప్రభుత్వం నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ జమచేస్తోంది. దీనికోసం  గ్యాస్ ఏజెన్సీలకు వినియోగదారులు కేవైసీలో బ్యాంకుఖాతాలను సమర్పించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.599 ఉండగా సబ్సిడీ రూ.138 వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.

 ప్రభుత్వ లబ్ధిదారులకే ఈ తిప్పలు
గ్యాస్ వినియోగదారులకు దాదాపు నాలుగైదు నెలల నుంచి సబ్సిడీ డబ్బు జమకావడంలేదు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్న వారికి మాత్రమే ఈ సమస్య ఏర్పడగా.. మిగిలిన వినియోగదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమవుతున్నాయి. ఉపాధిహామీ కూలీలు, ఆసరా ఫించన్‌దారులకు ఫినో కంపెనీ నుంచి సబ్సిడీ డబ్బు చెల్లిస్తున్నారు. ఈ వినియోగదారులు కేవైసీలో బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చినా ఆధార్‌కార్డు నంబర్ ఫీడింగ్‌తో ఫినో కంపెనీలో నమోదైన ఖాతాల్లోకి జమవుతోందని ఓంసాయిరాం గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. అయితే పలు గ్రామాల్లో టెక్నికల్ సమస్య పేరిట డబ్బులను కంపెనీ ప్రతినిధులు వినియోగదారులకు చెల్లించడంలేదని తెలుస్తోంది.

 మొగ్ధుంపూర్‌లో 50మందికి..
 కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లో దాదాపు 50మంది వినియోగదారులకు నాలుగైదు నెలలుగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు చెల్లించడంలేదు. తమకు కనీసం సమాచారం లేదంటూ ఇవ్వడంలేదని తాళ్లపల్లి ఎల్లమ్మ, వీరగోని వెంకటస్వామి, కందుల రమేశ్‌గౌడ్ ఆరోపించారు. స్మార్ట్‌మిషన్‌లో గ్యాస్ వినియోగదారుల ఆధార్‌కార్డు నంబర్‌ను ఫీడింగ్ చేస్తే కస్టమర్ నాట్‌అవైలబుల్ అనే సమాచారం రావడంతో డబ్బులను చెల్లించడం లేదని ఫినో కంపెనీ ప్రతినిధి సరస్వతి తెలిపారు. సమాచారమున్న కొందరు వినియోగదారులకు చెల్లించినట్లు వివరించారు. కొందరు వినియోగదారుల సమాచారం లభించడంలేదని, పూర్తి వివరాలను తెలుసుకుని సమస్య పరిష్కరించనున్నట్లు ఫినో మండల కోఆర్డినేటర్ రవూఫ్ తెలిపారు.

మరిన్ని వార్తలు