మరో సారి హైకోర్టును ఆశ్రయించిన ఫర్నీక తండ్రి

30 Sep, 2019 13:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గౌచర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఫర్నీకకి వైద్యం అందించడంలో నిలోఫర్‌ వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని పాప తండ్రి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడంలేదని వాపోయారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఫర్నీక వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించాలని, మెరుగైన చికిత్స అందించాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా కోర్టు ఆదేశాలను వైద్యులు పట్టించుకోవడం లేదని, తమ కూతురుకి చిక్సిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఫర్నీక తండ్రి మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. ఆస్పత్రిలో సరైన వసతులు లేవని, ఒక్కో బెడ్‌ మీద నలుగురు పిల్లలు ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో పాపను ఎలా ఉంచాలని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు పాటించి ఫర్నీకకు మెరిగైన చికిత్స అందించాలని కిరణ్‌ డిమాండ్‌ చేశారు. 

(చదవండి : చిన్నారి చికిత్సకు హైకోర్టు కీలక ఆదేశాలు)

అరుదైన వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పాపకు ప్రత్యేక బెడ్, వార్డు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని తండ్రి కిరణ్‌ కోరారు. చికిత్స కోసం ఎక్కువ ఖర్చు అవుతుండటం, ఆర్థిక స్థోమత లేని కారణంగా ఫర్నీక తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో చిన్నారికి తక్షణమే చికిత్స అందించాల్సిందిగా నిలోఫర్ ఆస్పత్రి, తెలంగాణ మెడికల్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు