బాహుబలులన్నీ సిద్ధం

27 Oct, 2019 01:56 IST|Sakshi
ఏడో బాహుబలి మోటారు వెట్‌రన్‌తో నీళ్లు వస్తున్న దృశ్యం

గాయత్రి పంపుహౌస్‌లో ఏడు మోటార్లకు వెట్‌రన్‌ పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని గాయత్రి (ప్యాకేజీ–8) పంప్‌హౌస్‌లోని బాహుబలి మోటార్ల న్నింటికీ పరీక్షలు పూర్తయ్యాయి. నిర్ణీత రెండు టీఎంసీల మేర గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా గాయత్రి పంపింగ్‌ కేంద్రం సిద్ధమైంది. అతితక్కువ సమయం లో పంపింగ్‌ కేంద్రాన్ని నిర్మించ డంతో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ కొత్త రికార్డు సృష్టించింది. ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్‌హౌస్‌ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే మోటార్లను ఏర్పాటు చేస్తుండగా, దాని దిగువన గాయత్రి పంప్‌హౌస్‌లో మోటార్ల సామర్థ్యం మరో 15 మెగావాట్ల మేర ఎక్కువగా అంటే 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే పంపులను ఏర్పాటు చేస్తున్నారు.

ఇక్కడ మొత్తంగా 7 మోటార్లను ఏర్పాటు చేసి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంది. ఒక్కో మోటారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. వ్యాసం 22 మీటర్లు, బరువు 650 టన్నులుగా ఉంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. ఈ పంప్‌హౌస్‌లో మొదటి పంప్‌హౌస్‌కు ఈ ఏడాది ఆగస్టు 11న మొదటి మోటార్‌ను ప్రారంభిం చగా, అదేనెల 14న రెండు, 20న మూడు, 31న నాలుగు, సెప్టెంబర్‌ 18న ఐదు, అక్టోబర్‌ 19న ఆరు మోటార్లను ప్రారంభించారు. శనివారం మిగిలిన ఏడో మోటార్‌ను ఈఎన్‌ సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల పథ కాల సలహాదారు పెంటారెడ్డి, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్‌ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మోటార్‌ దిగ్విజయంగా నడవడంతో ఇక్కడ నూటికి నూరు శాతం మోటార్లన్నీ సిద్ధమైనట్లయింది.

నెలాఖరుకు పూర్తి స్థాయిలో.. 
ఇక ఇప్పటికే లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి(అన్నారం)లలో మోటార్లు వెట్‌రన్‌లు పూర్తి చేసుకుని రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ మేఘా ఇంజనీరింగ్‌ సంస్థే పూర్తి చేసింది. ఇక సుందిళ్ల (పార్వతి)లో తొమ్మిది మోటార్లలో ఎనిమిది మాత్రమే సిద్ధమయ్యాయి. దీన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఇక ప్యాకేజీ–6లో మరో మోటార్‌కు వెట్‌రన్‌ నిర్వహించాల్సి ఉండగా, దానికి నెలాఖరున పూర్తి చేయనున్నారు. ఇవన్నీ పూర్తయితే తొలిదశలో కాళేశ్వరం ఎత్తిపోతలు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లే.

మరిన్ని వార్తలు