గిరిజన ఉపాధికి జీసీసీ కార్యాచరణ 

19 Dec, 2017 03:08 IST|Sakshi

గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి పలు కార్యక్రమాలు 

సాక్షి, హైదరాబాద్‌: గిరిజనుల ఆర్థికాభివృద్ధికి జీసీసీ (గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌) సరికొత్త కార్యాచరణ రూపొందిస్తోంది. ఐటీడీఏలకే పరిమితమైన జీసీసీ మైదాన ప్రాంతాలకూ విస్తరిస్తోంది. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతోపాటు గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కార్యక్రమాలను అమలు చేయనుంది. ఐటీడీఏల్లోని గిరిజన ఉత్పత్తుల నిర్వహణ, మార్కెటింగ్‌ వ్యవహారాలను జీసీసీ చూసుకునేది. తాజాగా ఆయా ఉత్పత్తులను నగరాలు, పట్టణాలకు పంపేలా చర్యలు చేపడుతోంది. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు మైదాన ప్రాంతాల్లో జీసీసీ నూనె, తేనె శుద్ధి, సహజ సబ్బుల తయారీ పరిశ్రమలు, న్యాప్‌కిన్స్‌ తయారీ, సోయా, చింతపండు శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. అలాగే ఉత్పత్తులు పెరిగి అక్కడ వృద్ధి రేటు పెరగనుంది. 

నైపుణ్యాభివృద్ధి వైపు..
ఐటీడీఏ ప్రాంతాల్లోని కుటుంబాలు ఎక్కువగా వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. దీంతో ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటోంది. పెద్దగా మార్పుల్లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వలసలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక కేంద్రాలను జీసీసీ ఏర్పాటు చేయనుంది. శిక్షణతో కూడిన ఉపాధికి చర్యలు తీసుకోనుంది. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2018–24 ప్రణాళికలో భాగంగా ఈ అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఆరేళ్ల ప్రణాళిక కొలిక్కి రానుంది. అనంతరం క్షేత్రస్థాయిలో చర్యలు వేగిరం చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.  

మరిన్ని వార్తలు