దక్షిణ మధ్య రైల్వే జీఎంతో జెన్‌కో సీఎండీ భేటీ

4 Apr, 2019 03:01 IST|Sakshi

 విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో సహకారంపై ప్రశంస

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర జెన్‌కో కార్పొరేషన్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దేవులపల్లి ప్రభాకరరావు బుధవారం సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మ్యాతో భేటీ అయ్యారు. సరుకు రవాణాలో అత్యధిక రికార్డు సాధించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు, అధికారుల బృందాన్ని, తెలంగాణలోని విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో జోన్‌ ఇస్తున్న సహకారాన్ని ప్రభాకరరావు ప్రశంసించారు. ఇదే విధమైన సహకారాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా దక్షిణ మధ్య రైల్వే కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణలోని మణుగూరు భద్రాద్రి పవర్‌ప్లాంట్, విష్ణుపురం యాదాద్రి పవర్‌ప్లాంట్, భూపాలపల్లి పవర్‌ప్లాంట్‌ వంటి విద్యుత్‌ ఉత్పాదక కేంద్రాల అనుసంధానంపై వారిద్దరూ చర్చించారు.

ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ ఎన్‌.మధుసూదనరావు, చీఫ్‌ ఫ్రైట్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ మేనేజర్‌ బి.నాగ్యతో కూడా ప్రభాకరరావు సమావేశమై సరుకు రవాణాలో విశేషమైన రికార్డు సాధించినందుకు వారిని అభినందించారు. సింగరేణి కాలరీస్‌ కంపెనీ నుండి దక్షిణ మధ్య రైల్వే రవాణా సౌకర్యం ద్వారా తెలంగాణ రాష్ట్ర జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు గత సంవత్సరం 2,969 రేక్‌ బొగ్గు సరఫరా చేస్తే, ఈ సంవత్సరం 3,194 రేక్‌ బొగ్గును సరఫరా చేసింది. అంటే గత ఏడాది కంటే 225 రేక్‌లు అధికం.

తెలంగాణలోని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు రైల్వేను అనుసంధానించే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభాకరరావు కోరారు. వేసవిలో పెరిగే విద్యుత్‌ డిమాండ్‌ దృష్ట్యా, పాల్వంచ వద్ద కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ విస్తరణ ప్రణాళికకు అనుగుణంగా సింగరేణి కాలరీస్‌ కంపెనీ నుంచి అవసరమైన బొగ్గును పంపడానికి సరిపడినన్ని రేక్‌లను సరఫరా చేయాలని రైల్వే ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. 

మరిన్ని వార్తలు