మొగ్గలోనే.. తుంచేస్తున్నారు

16 Mar, 2019 12:58 IST|Sakshi

జిల్లాలో జోరుగా లింగ నిర్ధారణ పరీక్షలు 

అనుమతులు లేకుండానే స్కానింగ్‌ సెంటర్ల నిర్వహణ 

కొరవడిన వైద్యాధికారుల పర్యవేక్షణ 

నర్సంపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన  5 నెలల గర్భిణినిఈనెల 12వ తేదీ రాత్రి చెకింగ్‌ కోసం నెక్కొండకు వెళ్లింది. కాసులకు కక్కు ర్తిపడిన సదరు స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు ఆడ శిశువని అబార్షన్‌ చేశారు. తీవ్ర గర్భస్రావమైన తర్వాత ఆమె గర్భంలో మగ శిశువు ఉందని తేలింది.  ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వర్గాలను నిలదీయగా బాధితులకు రూ.2 లక్షలు ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.  

నెక్కొండ మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన ఓ గిరిజన వివాహిత లింగ నిర్ధారణ పరీక్ష కోసం మండల కేంద్రానికి వచ్చింది.  సదరు వైద్యుడు పరీక్షలు చేసి ఆడ శిశువు ఉందని చెప్పారు. ఆమె నర్సంపేటలోని ఓ ఆస్పత్రిలో అబార్షన్‌ చేయించుకుంది. గర్భంలో ఉంది మగ శిశువు అని తేలడంతో ఆ గర్భిణి లబోదిబోమంది. తప్పుడు సమాచారం ఇచ్చిన సదరు వైద్యుడిని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు నిలదీశారు.  ఈ నేప«థ్యంలో ఇరువర్గాల నుంచి మధ్యవర్తుల ప్రమేయంతో  రూ.1.5 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. 

చెన్నారావుపేట మండలం సూరిపల్లికి చెందిన ఓ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం ఉన్నారు.  సదరు మహిళ మళ్లీ గర్భం దాల్చింది. కాగా నర్సంపేటలోని ఓ స్కానింగ్‌ సెంటర్‌లో పరీక్షలు చేయించడంతో ఆడపిల్ల అని తేలింది. వెంటనే ఆ మహిళను మహబూబాబాద్‌కు తీసుకువెళ్లి అబార్షన్‌ చేయించినట్లు సమాచారం. 

సాక్షి, వరంగల్‌ రూరల్‌: బాలికలపై వివక్ష కొనసాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ మొగ్గలోనే  తుంచేస్తున్నారు. మరికొందరు భువిపైకి చేరిన గంటల వ్యవధిలోనే ముళ్ల కంపలు, చెత్త కుండీలు, కాల్వల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడడమో, ఊపిరి ఆగిపోవడమో నిత్యం జరుగుతోంది. జిల్లాలో వెయ్యి మంది బాలురుంటే 988 మంది  బాలికలు ఉంటున్నారు. 

ఏటేటా లింగ నిష్పత్తిలో వ్యత్యాసం.. 
ఏటేటా బాలబాలికల లింగ నిష్పత్తిలో వ్యత్యాసం పెరుగుతూ వస్తోంది. స్కానింగ్‌ సెంటర్‌ల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించినా కాసుల కక్కుర్తికి స్కానింగ్‌ పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ అనుమతి పొందిన 25 స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయి. కానీ ప్రతి మండలం కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో   అనుమతి లేని స్కానింగ్‌ సెంటర్లు కొనసాగుతున్నాయి.

జిల్లాలో బాలబాలికల నిష్పత్తి

బాలురు 1000
బాలికలు  988

ఇవే కాక మొబైల్‌ స్కానింగ్‌లు సైతం చేపడుతున్నారు. మహబూబాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు మొబైల్‌ స్కానింగ్‌ చేస్తున్నారు. ఇద్దరు నుంచి ముగ్గురు గర్భిణులు స్కానింగ్‌ కోసం వస్తే వారి పేర్లను నమోదు చేసుకుని సదరు డాక్టర్‌ను పిలిపించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆడ పిల్ల అని తెలియగానే వెంటనే అబార్షన్‌ చేసి డాక్టర్‌ వెళ్లి పోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది.   

మగ శిశువు అయితే సోమవారం.. ఆడ అయితే శుక్రవారం 
తల్లి గర్భంలో ఉన్నంది మగ శిశువు అయితే సోమవారం అని.. ఆడ శిశువు అయితే శుక్రవారం అని కోడ్‌ భాషలను స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు వినియోగిస్తున్నారు.   స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు గ్రామాల్లో ఉండే ఆర్‌ఎంపీలతో లింక్‌ పెట్టుకుంటున్నట్లు తెలసుస్తోంది. లింగ నిర్ధారణ పరీక్షలకు గర్భిణులకు తీసుకువస్తే వారికి కమీషన్‌ చెల్లిస్తున్నట్లు తెలిసింది.  ఆడ శిశువు అయితే తొలగించేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. దీంతో వారి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.   

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం.. 
స్కానింగ్‌ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరిత్యా నేరం.  పరీక్షలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. స్కానింగ్‌ సెంటర్ల పై ప్రత్యేక నిఘూ పెట్టాం.  ఇద్దరు డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు పర్యవేక్షిస్తున్నారు.  – మధుసూదన్, జిల్లా వైద్యాధికారి

మరిన్ని వార్తలు