బేటీ బచావో..

7 Aug, 2017 01:30 IST|Sakshi
బేటీ బచావో..

పిల్లల లింగ నిష్పత్తిలో నగరాల వెనుకబాటు
► నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మెరుగు
► ప్రతి వెయ్యి మంది బాలురకు ముంబైలో 852 మంది బాలికలే.. ఢిల్లీలో అయితే 832 మందే..
►  హైదరాబాద్‌లో కాస్త మెరుగ్గా 942 మంది అమ్మాయిలు


మూఢనమ్మకాలు.. అమ్మాయిలకు వ్యతిరేకంగా పాతుకుపోయిన పక్షపాత వైఖరి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ–పురుష నిష్పత్తి తక్కువని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ.. వాస్తవం దీనికి పూర్తి విరుద్ధంగా ఉందట.. గ్రామాల్లోకంటే పట్టణాల్లో పిల్లల లింగ నిష్పత్తి దయనీయంగా ఉందట. దేశంలోని ముంబై, ఢిల్లీ సహా అతిపెద్ద నగరాల్లో బాలబాలికల నిష్పత్తిలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయట. 2011లో ప్రభుత్వ గణాంకాల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

ముంబై, ఢిల్లీల్లోనూ దారుణం..
2011లో ముంబైలో 0–6 సంవత్సరాల మధ్య ప్రతి వెయ్యి మంది బాలురకు.. 852 మంది బాలికలే ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఢిల్లీలో 832 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. హైదరాబాద్‌లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. భాగ్యనగరంలో ప్రతి వెయ్యి మంది బాలురకు.. 942 మంది బాలికలు ఉన్నారని కన్యా.లైఫ్‌ అనే వెబ్‌సైట్‌ వెల్లడించింది.

అమెరికాకు చెందిన హైస్కూల్‌ విద్యార్థి తరుణ్‌ అమర్‌నాథ్‌.. రిజిస్ట్రార్‌ జనరల్, సెన్సస్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి సేకరించిన.. అలాగే బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేసి తాను రూపొందించిన కన్యా.లైఫ్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 2011 జనాభా లెక్కల్లో సేకరించిన సమాచారం ఆధారంగా దేశంలోని 500 నగరాల్లో ఈ అధ్యయనం జరిగింది.

మహెసానాలో అత్యంత ఘోరం
2011 గణాంకాల ప్రకారం.. గుజరాత్‌లోని మహెసానాలో పిల్లల లింగ నిష్పత్తి అత్యంత దయనీయంగా ఉందని వెల్లడైంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు ఉన్న బాలికల సంఖ్య 762 మాత్రమే. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 772, మోడీనగర్‌లో 778, పశ్చిమబెంగాల్‌లోని ఇంగ్లిష్‌ బజార్‌లో 781 మంది బాలికలు ఉన్నారు. ఇక పశ్చిమబెంగాల్‌లోని బల్లీలో బాలుర కంటే బాలికల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక్కడ ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,185 మంది బాలికలు ఉన్నారు. అస్సాంలోని నాగావ్‌లో 1,043, తమిళనాడులోని తాంబరంలో 1,019 మంది బాలికలు ఉన్నారు.


సమతుల్యత ప్రకృతి సిద్ధ ప్రక్రియ
సాధారణంగా పిల్లల లింగ నిష్పత్తి పుట్టిన సమయంలో ప్రతి వంద మంది బాలికలకు 102–106 మంది బాలురుగా ఉంటుంది. ఇది వెయ్యి మంది బాలురుగా పరిగణనలోకి తీసుకున్నట్లయితే 943–980 మంది బాలికలుగా మారుతుందని లింగ పరమైన అంశాలపై పనిచేసే పలు సంస్థలు చెపుతున్నాయి. ప్రతి వెయ్యి మంది బాలురకు, వెయ్యి మంది బాలికలు ఉండరని, ఎందుకంటే పెరుగుతున్న సమయంలో అబ్బాయిల మరణాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని, లింగ నిష్పత్తి సమతుల్యత సాధించేందుకు ఇది ప్రకృతి సహజసిద్ధ ప్రక్రియ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

వివక్ష, భ్రూణహత్యల వల్లే..
సాధారణ నిష్పత్తి అయిన 943–980 కంటే బాలికల సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే బాలికలపై వివక్ష.. ఆడ శిశుభ్రూణ హత్యలు.. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్‌ చేయించడం వంటివి కొనసాగుతున్నట్లే. పిల్లల లింగ నిష్పత్తిలో వ్యత్యాసాల కారణంగా 2031 నాటికి దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు.. 936 మంది స్త్రీలే ఉంటారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇది 1951లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 946 మహిళలు ఉండేవారని పేర్కొంది. సగటు పిల్లల లింగ నిష్పత్తి ఈ 500 నగరాల్లో 902గా ఉంది. ఇదే సమయంలో గ్రామాల్లో సగటున ప్రతి వెయ్యి మంది పురుషులకు 923 మంది స్త్రీలు ఉండటం గమనార్హం.

సాక్షి, తెలంగాణ డెస్క్‌

మరిన్ని వార్తలు