ఫోన్‌ లిఫ్ట్‌ చేయమని చెప్పండి: రేవంత్‌రెడ్డి

8 Aug, 2019 15:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌ రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌, డిప్యూటి మేయర్‌ ఫసియొద్దిన్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరైయ్యారు. ముందుగా దివంగత కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సుష్మా స్వరాజ్, ముఖేష్‌ గౌడ్‌లతో పాటు ప్రమాదంలో మరణించిన ఇద్దరు బల్దియా ఉద్యోగుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రారంభమైన సమావేశంలో ఎంపీ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులకు ముందు ఫోన్‌ లిఫ్ట్‌ చేయమని చెప్పాలని, కనీసం ప్రోటోకాల్‌ పాటించాలని మేయర్‌కు సూచించారు. అధికారులను సరెండ​ర్‌ చేసే అధికారం సభకు ఉందని, సభ్యులు ఆ విశిష్ట అధికారాలను పాటించాలని తెలిపారు. బక్రీద్‌, గణేష్‌ నిమజ్జనం వంటి పండుగల ముందే  సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.

గచ్చిబౌలిలో ఎమ్మార్ ప్రాపెర్టీ అక్రమ నిర్మాణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో ఎక్కడచూసినా గుంతలే కనిపిస్తున్నాయని, వాటితో ప్రజలు ఇబ్బందులకు అనేక గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ సమస్యలను వెంటనే పరిష్కరించారాలని హెచ్చరించారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ వంటి ప్రదేశాలు బాగుంటాయని అందరూ అనుకుంటున్నారు, కానీ అవి కూడా ప్రస్తుతం అధ్వానంగా మారాయని పేర్కొన్నారు. నగరంలో ముఖేష్ గౌడ్, జైపాల్ రెడ్డి, సుష్మా స్వరాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కమిషనర్‌ దానకిషోర్‌ మాట్లాడుతూ.. కొంతమంది అధికారులు పని ఒత్తిడివల్ల కలవకపోయి ఉండవచ్చని అయితే అందరూ తప్పనిసరిగా ప్రజాప్రతినిధులను కలవాలని తెలిపారు. నగరంలో డెంగ్యూ కేసులు ఎక్కువయ్యాయని, వాటి నివారణకు చర్యలు చేపడతామన్నారు.

మరిన్ని వార్తలు