నాన్నొక చోట.. అమ్మొక చోట!

27 Aug, 2018 02:07 IST|Sakshi

అంతర్‌ జిల్లా స్పౌజ్‌ బదిలీలకు అవకాశం ఇవ్వని ప్రభుత్వం

భార్య ఓ చోట, భర్త మరోచోట నివాసం.. పిల్లలకు ఇబ్బందులు

ఈ కేటగిరీలో ఉపాధ్యాయులే అధికం

కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇతర విభాగాల్లోనూ ఇదే పరిస్థితి

సాధారణ బదిలీలు ఇటీవల పూర్తి

అంతర్‌ జిల్లా బదిలీలను తేల్చకుండానే సాధారణ బదిలీలపై నిషేధం

దివ్యాంగులైన నగేశ్‌ (బ్లైండ్‌) నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కె.మంజుల (బ్లైండ్‌) కూడా దివ్యాంగురాలే. ఆమె రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఓ పాఠశాలలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్నారు. వీరికిద్దరు పిల్లలు. సెలవుల్లో మాత్రమే వీరికి పిల్లల్ని కలుసుకునే వీలు కలుగుతోంది. మిగతా రోజుల్లో తండ్రి దగ్గరో.. తల్లి దగ్గరో పిల్లలు ఉండాల్సిందే.

మహేశ్‌ అనే మరో టీచర్‌దీ ఇదే పరిస్థితి. ఆయన జోగులాంబ గద్వాల జిల్లాలోని నుసానూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తుండగా.. ఆయన భార్య మంచిర్యాల జిల్లా చెన్నూరు ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఒకేచోట నివాసముంటూ రోజూ విధులకు హాజరవడం వీలుపడదు. దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.


సాక్షి, హైదరాబాద్‌ : ఉద్యోగుల సాధారణ బదిలీలను ఎట్టకేలకు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంతర్‌ జిల్లా బదిలీలను మాత్రం అటకెక్కించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత జూన్‌ నెలాఖరులో సాధారణ బదిలీల ప్రక్రియకు తెరలేపిన ప్రభుత్వం.. జూలై మూడో వారంతో ముగించింది. ఈ క్రమంలో సాగానికిపైగా ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. కానీ ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంతర్‌ జిల్లా ఉద్యోగుల బదిలీలను ఎటూ తేల్చకుండానే సాధారణ బదిలీలపై నిషేధం విధించింది.

దీంతో వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న దంపతులకు తీవ్ర నిరాశే మిగిలింది. దీంతో వారి పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన సందర్భంలో వారు ఒకేచోట నివాసముండే అవకాశం కల్పించేలా నిర్ణీత దూరంలో పోస్టింగ్‌ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ ఇటీవల జరిగిన బదిలీల్లో అంతర్‌ జిల్లా స్పౌజ్‌ బదిలీలకు మోక్షం దక్కలేదు. ప్రస్తుతం ఇలా ఇబ్బందులు పడుతున్న వారిలో ఉపాధ్యాయులే అధికంగా ఉన్నారు.

చివరగా 2012లో..
అంతర్‌ జిల్లా స్పౌజ్‌ బదిలీలు చివరగా 2012లో జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అంతర్‌ జిల్లా బదిలీల ప్రక్రియ నిర్వహించినప్పటికీ.. సీనియార్టీకి ప్రాధాన్యత ఇవ్వడంతో చాలామంది ఉద్యోగులకు అవకాశం దక్కలేదు. ఆ తర్వాత రెండు సార్లు సాధారణ బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో ఒకేచోట ఎక్కువ కాలం పనిచేస్తున్న ఆయా కేటగిరీలోని ఉద్యోగులకు బదిలీ అనివార్యమైంది. కొందరు ఉద్యోగులు మరింత దూరప్రాంతాలకు బదిలీ అయ్యారు. దీంతో అంతర్‌ జిల్లా బదిలీలు కోరుకునే వారికి ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఇటీవల సాధారణ బదిలీల సమయంలో అంతర్‌ జిల్లా స్పౌజ్‌ బదిలీలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తర్వాత ఆ ఊసెత్తలేదు.


కొత్త జిల్లాల ఏర్పాటుతో..
పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. రెండేళ్ల క్రితం 21 కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటికీ.. ఉమ్మడి జిల్లాలో పనిచేసే ఉద్యోగులనే అర్డర్‌ టు సర్వ్‌ పద్ధతిలో కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో మూడేళ్లపాటు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకే బదిలీ అవకాశం కల్పించడంతో చాలా మందికి అవకాశం దక్కలేదు.

అర్డర్‌ టు సర్వ్‌ పద్ధతిలో పంపించడంతో పాత పోస్టింగ్‌నే పరిగణిస్తారని ఉద్యోగులంతా భావించినప్పటికీ.. పనిచేస్తున్న చోటునే ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం షాకిచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్‌ టు సర్వ్‌ పేరిట ప్రభుత్వం చేసిన బదిలీలతో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లారు. భార్య, భర్తలు వేర్వేరు చోటకు బదిలీ కావడంతో నివాసాన్ని సైతం మార్చుకున్నారు. అలాంటి వారికి అంతర్‌ జిల్లా స్పౌజ్‌ బదిలీల ప్రక్రియ ఊరట ఇస్తుందని భావించినా.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు.  

మరిన్ని వార్తలు