కార్ల్‌ జూన్‌కు ‘జినోమ్‌’ అవార్డు

14 Feb, 2020 03:51 IST|Sakshi

ప్రకటించిన బయో ఆసియా

నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌కు కూడా..

ఈ నెల 17 నుంచి బయో ఆసియా

సాక్షి, హైదరాబాద్‌: కేన్సర్‌ మహమ్మారికి వినూత్న చికిత్సను అందుబాటులోకి తెచ్చిన అమెరికా శాస్త్రవేత్త డాక్టర్‌ కార్ల్‌ హెచ్‌.జూన్, ప్రజారోగ్య రంగంలో విశేష కృషి చేసిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీ నోవార్టిస్‌ సీఈవో డాక్టర్‌ వాస్‌ నరసింహన్‌లకు ఈ ఏడాది జినోమ్‌ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులు అందించనున్నట్లు బయో ఆసియా నిర్వాహకులు ప్రకటిం చారు. తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహించే బయో ఆసియా ఇప్పటికే ఆసియా మొత్తానికి అతిపెద్ద జీవశాస్త్ర సంబంధిత వేదికగా పరిణమించిన సంగతి తెలిసిందే.

ఫార్మా రంగంతోపాటు, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలను విస్తృతంగా చర్చించే బయో ఆసియా ఆయా రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి జినోమ్‌ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులు అందిస్తోంది. ఈ ఏడాది బయో ఆసియా సమావేశం ఫిబ్రవరి 17 నుంచి మూడు రోజులపాటు జరగనుంది. ఈ నేపథ్యంలో కార్ల్‌ హెచ్‌.జూన్‌కు జినోమ్‌ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు ఇస్తున్నట్లు బయో ఆసియా నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు.  ఆరోగ్య రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన వాస్‌ నరసింహన్‌లకు బయో ఆసియా తొలిరోజున అవార్డులు అందిస్తామని వివరించింది.

ఇమ్యూనోథెరపీ ద్వారా.. 
కేన్సర్‌ వ్యాధికి ప్రస్తుతం మూడు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి శస్త్రచికిత్స, రెండు రేడియో థెరపీ, మూడు కీమో థెరపీ. ఈ మూడింటితోనూ చాలా సమస్యలున్నాయి. కీమో, రేడియో థెరపీలతో జుట్టు ఊడిపోవడం మొదలుకొని ఆరోగ్యకరమైన కణాలూ నాశనమై అనేక దుష్ప్రభావాలు చూపుతాయన్నది మనకు తెలిసిందే. కేన్సర్‌ కణాలు రోగ నిరోధక శక్తి కణాలను దృష్టిని తప్పించుకోవడం ద్వారా శరీరమంతా వ్యాపిస్తుంటాయి.

అయితే కార్ల్‌ జూన్‌ ఈ రోగ నిరోధక వ్యవస్థ కణాల్లో (టి–సెల్స్‌) కొన్ని మార్పులు చేయడం ద్వారా అవి కేన్సర్‌ కణాలను గుర్తించి మట్టుబెట్టేలా చేయగలిగారు. కచ్చితంగా చెప్పాలంటే టి–సెల్స్‌ ఉపరితలానికి కైమెరిక్‌ యాంటిజెన్‌ రిసెప్టర్లను అనుసంధానిస్తారు. ఫలితంగా ఇవి కేన్సర్‌ కణాలను గుర్తించే శక్తిని పొందుతాయన్నమాట. దీన్నే ఇమ్యూనోథెరపీ అని పిలుస్తారు. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన మెరుగైన కేన్సర్‌ చికిత్స ఇది. కార్ల్‌ జూన్‌ పరిశోధనల ఆధారంగా అభివృద్ధి చెందిన టిసాజెన్‌లిక్లుయి అనే ఎఫ్‌డీఏ ఆమోదిత జన్యు చికిత్స అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు