అంగట్లో హాస్టల్‌ సీట్లు..!

26 Aug, 2019 08:27 IST|Sakshi
జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం (ఫైల్‌)

డబ్బులకు బీసీ పోస్టు మెట్రిక్‌ హాస్టళ్ల సీట్లు

బీసీ సంక్షేమ శాఖలో వెలుగు చూసిన కొత్త దందా

సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థిని నుంచి డబ్బులు వసూలు

అధికారి వైఖరితో కంగారు పడుతున్న వార్డెన్‌లు

సాక్షి, నిజామాబాద్‌: మొన్నటి వరకు బీసీ పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లలో సీట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల రికమండేషన్‌ లేఖలు ఇవ్వడంతో చాల మంది పేద విద్యార్థులకు సీట్లు దక్కని పరిస్థితి నెలకొంది. కానీ తాజాగా బీసీ సంక్షేమ శాఖ మరో కొత్త కోణం వెలుగు చూసింది. హాస్టల్‌ సీట్లకు  డిమాండ్‌ పెరగడంతో సీట్లు ఇప్పిస్తానంటూ ఓ అధికారి వసూళ్ల దందాకు తెరలేపినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి హాస్టళ్లలో సీట్లు ఇప్పించడానికి తెలిసిన వారితో భేరసారాలకు దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

డబ్బులకైతే ఓకే.. 
నందిపేట్‌ నూత్‌పల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్‌ 940 మార్కులతో పాసైంది. జిల్లా కేంద్రాంలోని గిరిరాజ్‌ కళాశాలలో సీటు రావడంతో బీసీ హాస్టల్‌లోనే ఉండి చదువుకోవడానికి తనకు తెలిసిన ఓ హాస్టల్‌ వర్కర్‌తో వెళ్లి దరఖాస్తు చేసుకుంది. ఇంటర్‌ ప్రైవేటు కళాశాలలో చదవడంతో సీటు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన ఓ అధికారి డబ్బులకైతే సీటు వస్తుందని హాస్టల్‌ వర్కర్‌తో భేరం కుదిర్చాడు. ఆ విద్యార్థని తల్లిదండ్రులు నుంచి కొంత డబ్బులు తీసుకొని సదరు అధికారికి ముట్టజెప్పాడు. కానీ ఇంత వరకు హాస్టల్‌లో సీటు ఇవ్వలేదు.
అక్రమంగా జేబులు నింపుకుంటున్న అధికారిసీటు కోసం కార్యాలయానికి వచ్చిన చాల మంది దగ్గర డబ్బులకు సీట్లు ఇచ్చారనే ఆరోపణలు ఆ అధికారిపై ప్రచారంలోకి వస్తున్నాయి. అందినకాడికి దండుకుని అక్రమంగా జేబులు నింపుకుంటున్న సదరు అధికారిపై తీరుపై శాఖలోని ఉద్యోగులు కూడా చర్చించుకుంటున్నారు.
 
జిల్లా కేంద్రంలో డిమాండ్‌ ఎక్కువ
జిల్లాలో బీసీ పోస్టు మెట్రిక్‌ హాస్టళ్లు 7 బాలికల, 6 బాలుర  మొత్తం 13 హాస్టళ్లున్నాయి. ఒక్కో హాస్టల్‌లో ప్రభుత్వం నుంచి 100 సీట్లు మాత్రమే మంజూరు ఉంటాయి. అయితే జిల్లా కేంద్రంలో కళాశాలలు అధికంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని హాస్టళ్లకు డిమాండ్‌ బాగా పెరిగిపోవడంతో సీట్ల సమస్యగా ఎక్కువగా ఉంది. జిల్లా కేంద్రంలో రెండు బాలికలు, రెండు బాలుర హాస్టళ్లు మాత్రమే ఉన్నాయి.దీంతో సీట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

ఆందోళనలో వార్డెన్‌లు
జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ హాస్టళ్లలో అదనంగా సీట్లు మంజూరు చేసుకుని భర్తీ చేసుకుంటున్న వార్డెన్‌లకు సదరు అధికారి వైఖరిపై గుబులు పట్టుకుంది. అదనంగా మంజూరు ఇస్తున్న సదరు అధికారి ఆర్డర్‌ కాపీలపై సంతకాలు లేకుండా వార్డెన్‌లకు ఇస్తున్నారు. సంతకాలు లేకుండా సీట్ల కేటాయింపులు చేయడంతో వార్డెన్‌లు ఆందోళన చెందుతున్నారు. జరిగిన సీట్ల కేటాయింపులో రేపటినాడు ఏదైనా తేడా వస్తే తామే బాధ్యులవుతామని భయంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు