వ్యవసాయానికి ఉపాధి దక్కేనా..!

13 Nov, 2018 12:57 IST|Sakshi
జూలపల్లిలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

     కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి రైతుల నిరీక్షణ

     పెండింగ్‌లో ప్రతిపాదనలు

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా రోజువారి పనుల్లో పాల్గొంటున్న వారిని వ్యవసాయరంగంలో సైతం సేవలు చేసేలా మార్పులు చేయాలని రైతులు చాలా ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే వ్యవసాయరంగానికి చేయూత ఇచ్చినట్లు అవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

జూలపల్లి: పనులు లేని రోజుల్లో గ్రామాల్లో ఉండే పేద ప్రజలకు, వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించాలని తీసుకొచ్చిన పథకం గ్రామీణ ఉపాధిహామీ పథకం. వ్యవసాయ పనులు లేని సమయాల్లో గ్రామల్లో ఉండే కూలీలు వలసపోకుండా అక్కడే పని కల్పించి ఉపాధి చూపెట్టడమే దీని ప్రధాన ఉద్దేశం. 2005లో చట్టం చేయబడి 2006లో ఉపాధిహామీ పథకం అమలులోకి వచ్చింది. మొదట్లో రోజుకు రూ.80 కూలీ ఇచ్చేవారు. ప్రస్తుతం రోజుకు రూ.205 ఇస్తున్నారు. ఈజీఎస్‌ పథకం కింద 45 శాతం యంత్రాలు, 55 శాతం కూలీలకు డబ్బులు ఇస్తున్నారు.

పరిస్థితి ఇలా..
గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం కింద పని చేసేవారు ఉదయం వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వస్తారు. దీంతో చాలా మంది కూలీలు వ్యవసాయ పనులకు రావడం లేదని వ్యవసాయదారులు అంటున్నారు. పంట సాగు చేసేప్పుడు, కోతలకు వచ్చిన సమయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి సంపూర్ణంగా అనుసంధానం చేస్తేనే చాలా ఉపయోగముంటుందని రైతులు అంటున్నారు. 

రాష్ట్రంలో 80 శాతం రైతులు సన్న, చిన్నకారు రైతులే. వారు వ్యవసాయ పనులు లేని సమయాల్లో ఉపాధి పనులకు వెళుతుంటారు. వ్యవసాయానికి ఉపాధిహామీని లింక్‌ చేస్తే ఇరువర్గాలకు లాభం చేకూరుతుందని వీరి వాదన. వ్యవసాయంలో 70 నుంచి 80 పనిదినాలకు మించి పనులు దొరకడం లేదని, 170 నుంచి 180 రోజులు పని ఉంటేనే ప్రధాన పనిదారుడు అంటున్నారని, అది కూడా గ్రామాల్లో లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.

జిల్లా పరిస్థితి ఇది..
జిల్లాలో మొత్తం 1,07,324 జాబ్‌ కార్డులు ఉండగా.. 2,41,058 మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది 61,682 పని దినాలు 98,496 మందికి పని కల్పించారు. రూ.4,442.94 కోట్లు ఖర్చు చేశారు.

కేంద్ర నిర్ణయంపైనే..
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఈజీఎస్‌తో లింక్‌ చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. రాజేంద్రనగర్, కరీంనగర్‌ రైతు సమన్వయ సమితి సమావేశాల్లో సైతం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కాగా వ్యవసాయ రంగానికి అనుసంధానిస్తే కూలీల ఆత్మగౌరవం దెబ్బతింటుందని, దారి తప్పిన ఈ స్కీమ్‌లో లోపాలు సరిచేయకుండా వ్యవసాయరంగానికి లింక్‌ చేస్తే మరింత అవినీతి జరిగే ప్రమాదముందని మరికొన్ని వర్గాల వాదనలున్నాయి. కాగా ఇప్పటికే 28 రకాల వ్యవసాయ పనులకు ఉపాధిహామీని లింక్‌ చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో వ్యవసాయరంగానికి అనుసంధానిస్తేనే రైతు ప్రగతి సాధ్యమని రైతులు కోరుతున్నారు. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంది.

వ్యవసాయానికి అనుసంధానించాలి
ఉపాధిహామీని వ్యవసాయానికి లింక్‌ చేస్తే రైతుకు ఖర్చు తగ్గడంతోపాటు సకాలంలో పనులు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ రంగాన్ని ఉపాధిహామీకి అనుసంధానం చేసి రైతులు, కూలీలను ఆదుకోవాలి

-కొత్త మల్లేశం, రైతు, కుమ్మరికుంట

సమాచారం రాలేదు
ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానించే సమాచారం ఏమీ ప్రభుత్వం నుంచి రాలేదు. చాలామంది రైతులు ఇదే అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. వస్తే బాగుంటుంది. ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంది.
-ప్రేమ్‌కుమార్, డీఆర్‌డీవో 

మరిన్ని వార్తలు