నిప్పు..ముప్పు

26 Jul, 2018 09:15 IST|Sakshi

ఫైర్‌ సేఫ్టీ ఇక తప్పనిసరి

నగరంలో  అత్యంత ప్రమాదకరంగా వెయ్యి సంస్థలు

గుర్తించిన జీహెచ్‌ఎంసీ  

తొలిదశలో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, గ్యాస్‌ గోడౌన్లపై చర్యలు వచ్చే వారం నుంచి నోటీసులు  

అగ్నిప్రమాదం జరిగితే.. తట్టుకునే సామర్థ్యంపై తనిఖీలు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, గ్యాస్‌ గోడౌన్లతో పాటు జనసమ్మర్థం ఎక్కువగా పోగయ్యే సంస్థలన్నీ ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. లేనిపక్షంలో వాటిపై చర్యలు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. గత సంవత్సరం డిసెంబర్‌ చివరి వారంలో ముంబై పబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పదిమందికి పైగా మరణించారు. కనీస ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవని ప్రమాదం జరిగాక గుర్తించారు. నగరంలోనూ అదే దుస్థితి నెలకొంది. నగరంలో ఉన్న దాదాపు 500 పబ్బులు, క్లబ్బులతోపాటు మాల్స్, హాస్పిటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, గ్యాస్‌ గోడౌన్లు తదితర సంస్థల్లో ఎలాంటి ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవు. ఇటీవల సికింద్రాబాద్‌లో పెయింటింగ్, ఎలక్ట్రికల్‌ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగింది. పలు కాలనీల్లోని నివాసాల మధ్యే గ్యాస్‌ గోడౌన్లు ఉండటాన్ని, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సహాయకచర్యలందే అవకాశాల్లేకపోవడాన్ని మునిసిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలో నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరి   అని జీహెచ్‌ఎంసీ భావించింది. గతంలో పలు సందర్బాల్లో ఫైర్‌సేఫ్టీకి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలనుకున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల విజిలెన్స్, ఎన్‌ఫోర్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి విశ్వజిత్‌ను నియమించాక,  ఫైర్‌సేఫ్టీ విభాగం బాధ్యతలు కూడా అప్పగించారు.

ఫైర్‌సేఫ్టీ స్క్రూటినీ..
ఇప్పటికే నగరంలోని పలు సంస్థలకు ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లున్నప్పటికీ, వాటిల్లో ఎన్ని సక్రమంగా ఉన్నాయో లేదో తెలియదు. ఎన్‌ఓసీ తీసుకునేంతవరకు మాత్రం ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు చేస్తున్న సంస్థలు ఆ తర్వాత నిర్వహణ పట్టించుకోవడం లేదు.  దీంతో  ఆయా సంస్థల్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లను స్క్రూటినీ చేయనున్నారు. ఈమేరకు భారీ భవంతులన్నింటికీ నోటీసులు జారీ చేయనున్నారు. తొలిదశలో బార్లు, పబ్బులు, రెస్టారెంట్టు, గ్యాస్‌ గోడౌన్లతోపాటు జనసమ్మర్ధం భారీగా పోగయ్యే సంస్థలకు నోటీసులు జారీ చేయనున్నారు. వీటిల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వెయ్యి సంస్థలున్నట్లు ఇప్పటి వరకు అంచనా వేశారు. సదరు సంస్థల్లో అగ్నిప్రమాదం జరిగితే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని గుర్తించారు.  ఈ పరిస్థితి నివారించేందుకు తొలిదశలో తగిన ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు చేయాల్సిందిగా నిర్వాహకులకు అవగాహన కల్పించనున్నారు. తర్వాత ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు చేసుకునేందుకు కొంత వ్యవధి ఇచ్చి..అప్పటికీ ఏర్పాటు చేసుకోనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే వారం నుంచి  సదరు సంస్థలకు నోటీసులు జారీ చేయనున్నారు. వారిచ్చే సమాచారంతో అధికారులు వెళ్లి స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ సందర్భంగా ఆయా  సంస్థలు నిబంధనల మేరకు తగిన సెట్‌బ్యాక్‌లు కలిగి ఉన్నాయా, ఫైరింజన్‌ వెళ్లే వీలుందా, ప్రమాదం జరిగితే వెంటనే బయటకు వెళ్లే దారులున్నాయా తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. వీటితోపాటు  ట్రేడ్‌లైసెన్సులు ఉన్నదీ లేనిదీ గుర్తిస్తారు. లోపాలున్న వారికి తగిన సమయమిస్తారు. ఆ తర్వాత నిబం ధనల మేరకు తగిన చర్యలు తీసుకోనున్నారు. 

తనిఖీల్లేవు..
గత జనవరిలో ముంబై ప్రమాద నేపథ్యంలో నగరంలోని పబ్బులు, క్లబ్బులు, తదితర జనసమ్మర్థం ఉండే సంస్థల్ని జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్, ఫైర్‌సేఫ్టీ, ఆరోగ్యం–పారిశుధ్యం, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారుల బృందాలతో తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి భావించారు. తనిఖీల సమయంలోనే భవననిర్మాణ అనుమతి, ట్రేడ్‌ లైసెన్సు, ఆస్తిపన్ను చెల్లింపు, తదితర అంశాలనూ తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాలనుకున్నప్పటికీ, అమలుకు నోచుకోలేదు. గ్రేటర్‌ పరిధిలో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన  భవనాలు నలభై  వేలకు పైగా  ఉన్నప్పటికీ దాదాపు మూడు వేల భవనాలకు మాత్రమే సంబంధిత ఎన్‌ఓసీలున్నట్లు సమాచారం. అవి కూడా భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేముందు ఏర్పాటు చేసుకున్నవి.

మరిన్ని వార్తలు