పగలే చీకట్లు!

28 Jan, 2019 10:37 IST|Sakshi
ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై చీకటిని తలపించిన వాతావరణం..

రోజంతా తుంపర, పొగమంచు

మధ్యాహ్నమే చీకటి వాతావరణం

పలు చోట్ల ఓ మోస్తరు వర్షం

9 డిగ్రీలు తగ్గిన పగటి ఉష్ణోగ్రత

వర్షాలపై కమిషనర్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మతులు

పరిస్థితిని పర్యవేక్షించిన దానకిశోర్‌

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఆదివారం పగలే చీకటి అలుముకుంది. బంగాళాఖాతంతో పాటు హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల శనివారం రాత్రి నుంచి మొదలైన పొగ మంచు..వర్షం ఆదివారం కూడా కొనసాగింది. నగరంతో పాటు శివార్లలోనూ దట్టమైన మేఘాలు కమ్ముకోవటంతో పట్టపగలే వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. వాహన వేగం కూడా భారీగా తగ్గింది. రోజంతా తుంపరతో పాటు పొగమంచు కురిసింది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నగరంలో 10.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పగటి పూట కేవలం  21.9 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే తొమ్మిది డిగ్రీలు తక్కువ. రాత్రి వేళల్లో 18.8 డిగ్రీలు నమోదైంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవటంతో చలి ఉధృతి పెరిగింది. ఇదిలా ఉంటే మరో రెండు రోజులు నగరంపై తుపాను ప్రభావం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయిన నేపథ్యంలో స్వైన్‌ ఫ్లూ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. నగర వాసులు బయటకు వెళ్లిన సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ అత్యవసర బృందాలను అప్రమత్తం చేశారు.

జీహెచ్‌ఎంసీ అలర్ట్‌
హైదరాబాద్‌ నగరంలో శనివారం రాత్రి కురిసిన ఆకస్మిక భారీ వర్షానికి జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగర వాసులకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా  అధికారులు, సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు. ప్రధానంగా భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌  హైదరాబాద్‌ కమిషనర్‌ దానకిషోర్‌కు ఫోన్‌ చేసి అప్రమత్తం చేశారు. దీంతో కమిషనర్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూంకు చేరుకొని నగరంలో పరిస్థితులను సమీక్షించారు. విపత్తుల నివారణ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటితో కలిసి ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజ్‌భవన్‌ రోడ్, లక్డీకాపూల్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్‌లను అప్రమత్తం చేయడంతో వారు నీటి ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని మోహరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టారు.

రోడ్ల పునరుద్ధరణకు ఆదేశాలు
నగరంలో గత రాత్రి భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ అధికారులను ఆదేశించారు. మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను 24 గంటలు,  మూడు షిఫ్టులుగా ఏర్పాటు చేయాలని. జోనల్, డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని సూచించారు.

మరిన్ని వార్తలు