'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

18 Jul, 2019 11:35 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు

మూడు వారాల్లో 3,878 మందికి జరిమానాలు.. రూ.55.57 లక్షల వసూలు

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో పారిశుధ్య కార్యక్రమాల అమలుకు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, కోట్ల రూపాయలతో రెండు రంగుల చెత్తడబ్బాలు పంపిణీ చేసినా తగిన ఫలితం కనిపించలేదు. దీంతో జీహెచ్‌ంఎసీ స్వచ్ఛ నిబంధనలు  ఉల్లంఘించేవారిపై జరిమానాల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇందులో భాగంగా 50 మైక్రాన్ల కన్నా తక్కువ ప్లాస్టిక్స్‌ బ్యాగులు వాడుతున్న వ్యాపారులపైనా, రోడ్లు, నాలాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తున్నవారిపైనా, రోడ్లపై చెత్త వేస్తున్నవారితో పాటు శుభ్రం చేసిన ప్రాంతాల్లో ఉమ్మి వేయడం వంటి పనులకుపాల్పడుతున్నవారిపై సైతం జరిమానాలు విధిస్తోంది. అలాగైనా ప్రజల్లో మార్పు వస్తుందని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.

గత మూడు, నాలుగేళ్లుగా పారిశుధ్యంపై ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా చెప్పుకోదగ్గ ఫలితం కనిపించక పోవడంతో ఇక జరిమానాలతోనైనా మారగలరని భావించి ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఉన్నతాధికారులు సర్కిళ్ల వారీగా టార్గెట్లు విధించి మరీ జరిమానాలు వేస్తున్నారు. తాజాగా బుధవారం ఒక్కరోజే వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 120 మంది నుంచి రూ.96,100 జరిమానాగా వసూలు చేశారు. గత మూడు వారాల్లో 3,878 మందిపై జరిమానాలు విధించి వారి నుంచి రూ.55.57 లక్షలు వసూలు చేశారు. జరిమానాల విధింపు వల్ల ప్రజల వైఖరి మారుతుందనే తప్ప, జీహెచ్‌ఎంసీ ఆదాయం కోసం మాత్రం కాదని కమిషనర్‌ దానకిశోర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా రోడ్లపై చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేస్తున్నవారితో పాటు 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ వినియోగిస్తున్న దుకాణదారులపై ఎక్కువ దృష్టి సారించారు. 

అవగాహనకు స్పెషల్‌ డ్రైవ్‌
జరిమానాల విధింపుతో పాటు చిరువ్యాపారులు 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌లు వాడకుండా, తప్పనిసరిగా డస్ట్‌బిన్లు వాడాల్సిందిగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో దాదాపు 30 వేల మంది చిరువ్యాపారాలు చేసుకుంటున్నట్లు గుర్తించారు. వీరికి అవగాహన కల్పిస్తున్నారు. తమ హెచ్చరికలు, జరిమానాలతో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోందని అధికారులు పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలైన చార్మినార్, గోల్కొండ కోటల్లో సైతం వ్యర్థాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

మరిన్ని వార్తలు