సాయంత్రమూ సాఫ్‌

23 Jul, 2019 09:08 IST|Sakshi

ఇక సాయంత్రం వేళల్లోనూ చెత్త తరలింపు  

ఒక్కో సర్కిల్‌కు నాలుగు వాహనాలు  

రెండు చొప్పున బాబ్‌కాట్‌లు  

రహదారుల శుభ్రతకు జీహెచ్‌ఎంసీ చర్యలు  

స్థానిక కేంద్రాల్లో చెత్త పేరుకుపోయే అవకాశం

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో రోజురోజుకు చెత్త పెరిగిపోతోంది. జీహెచ్‌ఎంసీ 2012–13లో 2,200 మెట్రిక్‌ టన్నుల చెత్తను తరలించగా... ప్రస్తుతమది 5,000 మెట్రిక్‌ టన్నులను దాటిపోయింది. అయినప్పటికీ వాణిజ్య ప్రాంతా ల్లో, రహదారులపై ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తోంది. చెత్త తరలింపు కోసం జీహెచ్‌ఎంసీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా, రోడ్లపై వ్యర్థాలు వేయకుండా జరిమానాలు విధిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఉదయం చెత్త తరలించినప్పటికీ... తిరిగి చెత్త ఎక్కువగా పోగవుతున్న ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లోనూ తరలించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఇందుకోసం 120 అద్దె వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. వీటిని ఒక్కో సర్కిల్‌కు నాలుగు చొప్పున కేటాయించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ సోమవారం పేర్కొన్నారు. వీటితో పాటు ఒక్కో సర్కిల్‌కు రెండు చొప్పున 30 సర్కిళ్లకు మొత్తం 60 బాబ్‌కాట్‌లను కేటాయించారు. 

మరి డంపింగ్‌యార్డుకు.?
అందుబాటులోకి రానున్న వాహనాలు ఆయా ప్రాంతాల్లోని చెత్తను రవాణా కేంద్రాలకు తరలిస్తాయి. అక్కడి నుంచి పెద్ద వాహనాలు (25 మెట్రిక్‌ టన్నులు, 10 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం) చెత్తను డంపింగ్‌యార్డుకు వెంటనే తరలించాల్సి ఉంది. లేని పక్షంలో రవాణా కేంద్రాల్లో సాయంత్రం వేసే చెత్తకు మళ్లీ ఉదయాన్నే వచ్చే చెత్త తోడైతేటన్నుల కొద్దీ పేరుకుపోతుంది. జీహెచ్‌ఎంసీలో అద్దెవి, సొంతవి కలిపి 25 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన వాహనాలు దాదాపు 130 ఉన్నాయి. అలాగే 10 మెట్రిక్‌ టన్నులవి జీహెచ్‌ఎంసీ వాహనాలే 7 ఉన్నాయి. తాజాగా వినియోగంలోకి రానున్న ఒక్కో వాహనం దాదాపు 3 మెట్రిక్‌ టన్నుల చెత్తను రవాణా కేంద్రానికి చేరుస్తుంది. ఇలా 120 వాహనాల ద్వారా 360 మెట్రిక్‌ టన్నుల చెత్త  స్థానిక రవాణా కేంద్రాలకు చేరుతుంది. దీన్ని వెంటనే డపింగ్‌యార్డుకు తరలించని పక్షంలో రవాణా కేంద్రంలో సమస్యలు తలెత్తుతాయి. 

సమస్యలు పునరావృతం..
స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టిన తొలినాళ్లలో ఇలాంటి సమస్యలే ఉత్పన్నమయ్యాయి. తొలి దశలో రెండు వేలు, ఆ తర్వాత 500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో దాదాపు 2,100 స్వచ్ఛ ఆటోలు చెత్త తరలిస్తున్నాయి. వీటి ద్వారా చెత్త ఇళ్ల నుంచి రవాణా కేంద్రాలకు చేరుతున్నప్పటికీ.. అక్కడి నుంచి డంపింగ్‌యార్డుకు వెళ్లకపోవడంతో రవాణా కేంద్రాల్లో చెత్త పేరుకుపోతోంది. అక్కడి నుంచి చెత్తను తరలించేంత వరకూ ఆలస్యంగా వచ్చే స్వచ్ఛ ఆటో టిప్పర్లు రోడ్డుపైనే బారులుతీరాల్సి వచ్చేది. నిర్ణీత సమయాలు కేటాయించి, ఇతరత్రా చర్యలు చేపట్టి ఆ సమస్యను పరిష్కరించినప్పటికీ... ఇప్పుడిక సాయంత్రం అదనంగా చేరే చెత్తతో తిరిగి సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంది. దీని పరిష్కారానికి చర్యలు తీసుకోని పక్షంలో సమస్యలు తప్పవు. 

బస్టాప్‌కు రెండు  
నగరంలోని అన్ని బస్టాప్‌ల వద్ద రెండు డస్ట్‌బిన్‌లను వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని జీహెచ్‌ంఎసీ కమిషనర్‌ దానకిశోర్‌.. జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. వీధి వ్యాపారులందరూ ఆగస్ట్‌ నెలాఖరులోగా ప్రత్యేక డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే కార్మికులందరూ సేఫ్టీ పరికరాలను విధిగా ధరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.  

మరిన్ని వార్తలు