వద్దనుకుంటే వదిలేద్దాం

5 Nov, 2019 11:55 IST|Sakshi
సోమాజిగూడలో ఇళ్ల నుంచి పనికిరాని వస్తువులను సేకరిస్తున్న బల్దియా సిబ్బంది

నిరుపయోగ వస్తువుల సేకరణకు స్పెషల్‌ డ్రైవ్‌  

నగరవాసుల నుంచి అనూహ్య స్పందన

రెండురోజుల్లో 42.336 మెట్రిక్‌ టన్నుల సేకరణ

సాక్షి,సిటీబ్యూరో: ఇళ్లల్లోని పనికిరాని వస్తువుల సేకరణ కోసం జీహెచ్‌ఎంసీ చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌కు నగరవాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తమ ఇళ్లలో ఉన్న నిరుపయోగ వస్తువులను ఎక్కడ వేయాలో తెలియక, ఇంట్లో ఉంచుకోలేక ఇబ్బందులు పడుతున్న నగరవాసులు ఈ కార్యక్రమానికి జైకొడుతున్నారు. ఇంటికే వచ్చి ఆయా వస్తువులను బల్దియా సేకరిస్తుండడంతో ఎన్నో ఏళ్ల నుండి తమ ఇళ్లలో ఉన్న  నిరుపయోగ వస్తువులను పెద్ద ఎత్తున అందజేస్తున్నారు. ఈనెల 12వ తేదీ వరకు జరిగే ఈ డ్రైవ్‌లో ఇళ్లలో వృథాగా ఉన్న పాత వస్తువులు, కూలర్లు, పరుపులు, మెత్తలు, పనిచేయని ఎలక్ట్రానిక్‌ వస్తువులు, విరిగిన కుర్చీలతో పాటు పనికిరాని ఏ వస్తువునైనా ఇచ్చేయవచ్చు.

రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి దాకా మొత్తం 42.336 మెట్రిక్‌ టన్నుల వ్యర్థ వస్తువులను సేకరించారు. సోమవారం ఒక్కరోజే 1.883 ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు, 7.821 మెట్రిక్‌ టన్నుల విరిగిన ఫర్నిచర్, 4.073 మెట్రిక్‌ టన్నుల పనికిరాని పరుపులు, మెత్తలు, 1.651 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ సామగ్రి, 0.005 మెట్రిక్‌ టన్నుల హానికర వస్తువులు, 5.245 మెట్రిక్‌ టన్నుల ఇతర వస్తువులను జీహెచ్‌ఎంసీ సేకరించింది.  సోమవారం ఖైరతాబాద్‌ సర్కిల్‌ సోమాజిగూడలోని దుర్గానగర్‌లో నిర్వహించిన నిరుపయోగ వస్తువుల సేకరణను మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలించారు. తమ ఇళ్లలోని పనికిరాని వస్తువులను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా జీహెచ్‌ఎంసీకి అందజేయాలని ఆయన నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగే స్పెషల్‌ డ్రైవ్‌లో ఆయా కాలనీలకు తమ వాహనాలు వస్తాయని, లేదా ఎంపిక చేసిన స్థలాల్లోనూ ఈ అనవసర వస్తువులను వదిలివెళ్లాలని మేయర్‌ విజ్ఞప్తి చేశారు.నగరంలో ఈ పనికిరాని వస్తువులన్నింటినీ రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేస్తున్నారని, తద్వారా నాలాలు, మ్యాన్‌హోళ్లు పూడుకుపోయి మురుగు పొంగి రోడ్లను ముంచెత్తుతోందని పేర్కొన్నారు.

రెండు రోజుల్లో సేకరించిన వ్యర్థాలు (మెట్రిక్‌ టన్నుల్లో) ..
ఎలక్ట్రానిక్‌: 2.027 ఎం.టీ
విరిగిన ఫర్నిచర్‌: 14.485
పాత పరుపులు, మెత్తలు: 11.281
ప్లాస్టిక్‌: 3.329
హానికర వస్తువులు: 0.010
ఇతర వస్తువులు: 11.399 ఎం.టీ 

మరిన్ని వార్తలు