-

'కలర్‌'ఫుల్‌

11 Jul, 2019 11:06 IST|Sakshi

ప్రధాన జంక్షన్లలో రంగు రంగుల పూలమొక్కలు

హరితహారంలో బ్యూటిఫికేషన్‌పై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి

సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ నగరం కోసం ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తోన్న జీహెచ్‌ఎంసీ..ఇక కూడళ్ల బ్యూటిఫికేషన్‌పై దృష్టి సారించింది. సదరు కూడళ్లలో రంగురంగుల పూలమొక్కలు ఉంటే జంక్షన్లు అందంగా ఆకట్టుకునేలా ఉంటాయని     భావించింది. స్వచ్ఛ కార్యక్రమాల పేరిట చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు లేకుండా చేయడం, ప్రధాన రహదారులను శుభ్రంగా ఉంచడమే కాకుండా  ప్రముఖ జంక్షన్లు, చౌరస్తాల్లో పూలమొక్కలతో సుందరీకరించాలని నిర్ణయించింది. ఆయా కూడళ్లలో బంతి, చామంతిల వంటి సాధారణ పూలమొక్కలతోపాటు  వివిధ రంగులతో ప్రత్యేక ఆకర్షణగా  ఆకట్టుకునేలా కనిపించేందుకు వివిధ వెరైటీల కాస్మోస్, వింకా రోజ్, ఇంపేషన్స్‌ బాల్సేమినా, తదితరమైన సీజనల్‌ పూల మొక్కలను నాటనున్నారు.

ఈ పూలమొక్కల జీవితకాలం దాదాపు నాలుగు నెలలే కావడంతో నాలుగు నెలలు గడిచాక  తిరిగి మళ్లీ నాటుతారు. ఇలా ఏడాదిలో మూడు పర్యాయాలు ఏ సీజన్‌లో బతికే పూలమొక్కలను ఆ సీజన్‌లో నాటనున్నారు. తద్వారా ఎప్పటికప్పుడు తాజాగా, ఆయా పూల రంగులతో జంక్షన్లకు కొత్త అందాలు తెచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో అందాల కోసం బోగన్‌విల్లా, ప్లుమేరియా వంటివి మాత్రమే నాటేవారు కాగా, ఏడాదిపొడవునా జంక్షన్లు అందంగా కనిపించేందుకు ఈసారి వాటితోపాటు వివిధ రకాల సీజనల్‌ పూలమొక్కల్ని నాటేందుకు సిద్ధమయ్యారు. తొలిదశలో విశాలమైన కూడళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించారు. దిగువ ప్రాంతాలను అందాన్నిచ్చే పూలమొక్కలతో తీర్చిదిద్దనున్నారు. సుచిత్రా జంక్షన్, ఎల్‌బీనగర్‌ జంక్షన్, నిజాంకాలేజీ జంక్షన్, అసెంబ్లీ ఎదుటనున్న జంక్షన్, ఏక్‌మినార్, రోజ్‌ఫౌంటెన్, మహారాజా అగ్రసేన్, బేగంపేట రాజీవ్‌గాంధీ జంక్షన్,  నాగార్జున సర్కిల్‌ , బంజారాహిల్స్‌ రోడ్‌నెం.1, రోడ్‌నెం.2లలో రోడ్ల పొడవునా జీవీకేమాల్‌ ఎదుట కూడా ఈ పూలమొక్కలు నాటుతారు. మలిదశల్లో మిగతా పెద్ద కూడళ్లలోనూ అందాల మొక్కలను నాటనున్నారు.  

వర్షాలు పడ్డాక తొలిదశలో కోటి మొక్కలు నాటాలనేది జీహెచ్‌ఎంసీ లక్ష్యం. ఇందులో
5 లక్షల మొక్కల్ని జీహెచ్‌ఎంసీ ఆయా ప్రాంతాల్లో నాటుతుంది.
5 లక్షల్ని విద్యాసంస్థలు, ఆయా సంస్థల్లో నాటేందుకు కోరిన వారికి అందజేస్తారు.
5 లక్షల పూలమొక్కలు కూడళ్లలో అందాల కోసం నాటుతారు.
85 లక్షలు ఇళ్లల్లో నాటుకునేందుకు ప్రజలకు అందజేస్తారు. వీటిల్లో పూలు, పండ్లు, ఔషధ, తదితర మొక్కలున్నాయి.

సీజనల్‌ పూలకు ప్రాధాన్యం
ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా  జీహెచ్‌ంఎసీలో  తొలిదశలో భాగంగా  కోటి మొక్కలు నాటాలనేది లక్ష్యం కాగా, వాటిల్లో సీజనల్‌ ఫ్లవర్‌ ప్లాంట్స్‌కూ ప్రాధాన్యమిచ్చాం. వీటిని ఆయా కూడళ్లలో పెంచడం ద్వారా ఆయా మార్గాల్లో వెళ్లేవారికి కనులకింపుగా అందంగా కనిపిస్తాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఆదేశాల మేరకు ఈసారి హరితహారంలో భాగంగా జంక్షన్లను పూలమొక్కలతో అందంగా సుందరీకరించేందుకు ప్రాధాన్యమిచ్చాం. ఇప్పటికే కొన్ని జంక్షన్లలో పనులు ప్రారంభమైనప్పటికీ, సరైన వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం. తగిన వర్షం పడ్డాక అన్ని కూడళ్లలోనూ వీటిని నాటుతాం. వీటి జీవితకాలం దాదాపు నాలుగునెలలే అయినందున, నాలుగునెలల తర్వాత మళ్లీ కొత్తమొక్కలు నాటుతాం. ఈ సీజన్‌లో ఐదు లక్షల రంగురంగుల పూలమొక్కలను ఆయా జంక్షన్లలో నాటుతాం.తద్వారా కూడళ్లకు కొత్త అందాలతో కనిపిస్తాయి. – వి.కృష్ణ, అడిషనల్‌ కమిషనర్, జీహెచ్‌ఎంసీ

మరిన్ని వార్తలు