గ్రేటర్‌కు మూడు కోట్ల మొక్కలతో ‘హరితహారం’

2 Jul, 2019 16:17 IST|Sakshi

సాక్షి, హైదరబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘హరితహారం’ కార్యక్రమం ఐదో విడత ఈ నెలలో చేపట్టనున్నారు. గత నాలుగు విడతల్లో ఈ కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలను నాటిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాది హరిత హారంలో భాగంగా 83.30 కోట్ల మొక్కలను నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే మూడు కోట్ల మొక్కలను నాటేందుకు వీలుగా జీహెచ్‌ఎంసి కమిషనర్‌ దాన కిషోర్‌, అడిషనల్‌ కమిషనర్లు అమ్రపాలి కాటా, కృష్ణలు భారీ ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా మొక్కలను పెంచడానికి రాజేంద్రనగర్‌, కొంగరకలాన్‌లోని నర్సరీలకు అప్పగించి వాటి పని తీరును పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతానికి కోటి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన కోటిన్నర మొక్కలను ప్రైవేటు నర్సరీలకు ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం టెండర్లు వేసి అందులో ఎంపికైన ప్రైవేటు నర్సరీలకు మొక్కల పెంపకాన్ని అప్పగించి.. మరో పది రోజుల్లో కోటిన్నర మొక్కలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు