‘ఎప్పటికప్పుడు ఐటీ కంపెనీలకు సమాచారం అందిస్తాం’

29 Jun, 2019 13:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తాజాగా కురిసిన వర్షానికి ఐటీ కారిడర్‌ మొత్తం స్తంభించింది. చిన్న పాటి వర్షానికే మాదాపూర్‌, హైటెక్‌సిటీ, శిల్పారామం ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది. దాదాపు ఐదు గంటలపాటు ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్‌లోనే చిక్కుకున్నారు. శిల్పారామం వద్ద గల ఓ నాలా పొంగిపొర్లడంతో ఈ సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ దానకిషోర్‌ చర్యలు చేపట్టారు. ఈ విషయంపై అధికారులతో నేడు సమావేశమయ్యారు.

భారీ వర్షాలు కురిసినప్పుడు ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బంది ఉంటుందని అన్నారు. 2.5 లక్షలు నుండి ఇప్పుడు 5.5 లక్షలు కి ఉద్యోగుల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఒకేసారి 3.5 లక్షలు వాహనాలు రోడ్ల పైకి వచ్చినప్పుడు ఇబ్బంది కరంగా మారుతుందని పేర్కొన్నారు. వర్షం ఎంత సమయం పడుతుంది , ఎంత స్థాయిలో వర్షం కురిసింది అనేది ఐటీ కారిడార్ కి సమాచారం లేకుండా పోతోందని అన్నారు. ఇక నుండి ఐటీ కంపనీలకు వర్ష సూచన, ట్రాఫిక్ సమస్య పై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని తెలిపారు. ఎస్‌ఎమ్‌ఎస్‌, మెయిల్స్ ద్వారా అందరికి సమాచారం ఇస్తామన్నారు. ఇప్పటికే 80 శాతం నాలాలను క్లీనింగ్ చేశామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు