బాస్‌ సీరియస్‌

2 Nov, 2018 09:23 IST|Sakshi
అధికారులతో మాట్లాడుతున్న దానకిశోర్‌

టౌన్‌ప్లానింగ్‌ అక్రమాలపై దానకిశోర్‌ ఆగ్రహం  

అక్రమ నిర్మాణం జరగకముందే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీత

నిర్ణీత వ్యవధిలోగా తనిఖీలు చేయాల్సిందే..

ఆన్‌లైన్‌లోనే తనిఖీ తేదీలు ఫిక్స్‌ చేయండి

నోటీసుల వివరాలూ ఆన్‌లైన్‌లోనే ఉండాలి

అధికారులు, సిబ్బందికి కమిషనర్‌ ఆదేశం

‘ఎన్నికల వేళ.. అక్రమాల లీల’ కథనంపై చర్చ

సాక్షి, సిటీబ్యూరో: టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అక్రమాలు, నగరంలో ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై సిబ్బంది చర్యలు తీసుకోకపోవడంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌ సీరియస్‌ అయ్యారు. అక్రమ నిర్మాణం జరుగుతుందని తెలిసినప్పటికీ ఎందుకు అడ్డుకోవడంలేదని టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగులను ప్రశ్నించారు. పిల్లర్లు వేశాక శ్లాబ్‌ వేసేందుకు ఎంతో సమయం పడుతుందని, ఆలోగా ఎందుకు నిలువరించలేకపోతున్నారని నిలదీశారు. నిర్మాణం మొత్తం పూర్తయ్యేంతదాకా చోద్యం చూస్తూ మొక్కుబడి తంతుగా నోటీసులిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికల వేళ.. అక్రమాల లీల’ శీర్షికతో ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన అక్రమ నిర్మాణాలపై ఆయన స్పందించారు.

గురువారం టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన కమిషనర్‌ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోలేకపోవడాన్ని ప్రస్తావించారు. సంబంధిత సెక్షన్‌ ఆఫీసర్‌ కోర్టు పనులంటూ చెప్పడంతో ‘రోజంతా కోర్టులోనే ఉంటారా?’ అంటూ దానకిశోర్‌ ప్రశ్నించారు. అదనపు అంతస్తుకు పిల్లర్లు వేశాక శ్లాబ్‌ పూర్తయ్యేలోపునే అడ్డుకోనందుకు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్‌ చేయవద్దంటూ ప్రశ్నించారు. తొలి సమావేశం కావడంతో ప్రస్తుతానికి మెమో జారీ చేయాల్సిందిగా సీసీపీకి సూచించారు. ఇకపై ఎవరు నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని, అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత టౌన్‌ప్లానింగ్‌ విభాగానిదేనని స్పష్టం చేశారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగం నుంచే తనకు అత్యధిక  ఫిర్యాదుల వస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. రోజుకు తనకు 30 ఫిర్యాదులు అందితే, వాటిలో 27 టౌన్‌ప్లానింగ్‌వే నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అక్రమ నిర్మాణాలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. 

నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు చేయాల్సిందే..
భవననిర్మాణ అనుమతులు జారీ కాగానే, నిర్ణీత వ్యవధుల్లోగా తనిఖీలు చేసేందుకు తగిన విధానాన్ని రూపొందించాలని, తనిఖీలకు ఎప్పుడు వెళ్లాలనేది కూడా ఆన్‌లైన్‌లోనే ఆటోమేటిక్‌గా జనరేట్‌ అయ్యేలా తగిన ఏర్పాట్లు చేయాలని దానకిశోర్‌ సిబ్బందికి సూచించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసుల జారీని కూడా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. తద్వారా ఎప్పుడు నోటీసులిచ్చారు.. తదుపరి ఏం చర్యలు తీసుకున్నారు.. అనే విషయాలు తెలుస్తాయన్నారు. మార్టిగేజ్‌ నిబంధనల్లేని 200 చ.మీ. లోపు నిర్మాణాల్లోనే అదనపు అంతస్తులు ఎక్కువగా వెలుస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకొని వాటిపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. ఎన్నికల తరుణాన్ని ఆసరా చేసుకొని అక్రమనిర్మాణాలు జరుగకుండా తనిఖీ చేపట్టాలని, కూల్చివేతలకు వెనుకాడవద్దని స్పష్టం ఆయన చేశారు.  

అక్రమ నిర్మాణాలపై విజిలెన్స్‌ అస్త్రం
ఇప్పటికే జరిగిన అక్రమ నిర్మాణాలు, అదనపు అంతస్తుల వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ విభాగానికి అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. టౌన్‌ప్లానింగ్‌ సిబ్బందితో కలిసి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు అక్రమ నిర్మాణాలను తొలగిస్తాయని పేర్కొన్నారు. అయితే నిరుపేదలు, చిరు వ్యాపారుల జోలికి పోవద్దని స్పష్టం చేశారు. కొంతమంది టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది వల్లే సిటీలో అక్రమ నిర్మాణాలు వస్తున్నాయని పత్రికల్లో వస్తుండటాన్ని ప్రస్తావించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి సర్కిళ్ల వారీగా  ఎన్ని అక్రమ నిర్మాణాలు, డీవియేషన్లు ఉన్నాయో, ఎన్నింటికి నోటీసులు జారీచేశారో, కోర్టు కేసులెన్ని ఉన్నాయో వివరాలను ఏరోజుకారోజు నమోదు చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ రూపొందించి, ప్రతిరోజూ ఈ సమాచారం పొందుపరచాలన్నారు. సమావేశంలో చీఫ్‌ సిటీ ప్లానర్లు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాసరావు, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తదితరులు పాల్గొన్నారు.  

నిర్ణయాలు ఓకే.. అమలు సంగతి?
అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోవాలని దాదాపు ఏడాది క్రితమే నిర్ణయించారు. అందులో భాగంగా అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు కూల్చివేసేందుకు సర్కిల్, జోన్ల స్థాయిలో టౌన్‌ప్లానింగ్, విజిలెన్స్, తదితర విభాగాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ అమలుకు నోచుకోలేదు.

మరిన్ని వార్తలు