స్మార్ట్‌ పాలన... ‘బిగ్‌’ ప్లాన్‌

29 Aug, 2018 09:27 IST|Sakshi
గవర్నర్‌ నరసింహన్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసిన దానకిశోర్‌

ఉన్న వనరులతో అభివృద్ధి పథంలో ముందుకు

తక్షణ సేవలు.. సిబ్బంది నైపుణ్యం పెంపు

అందరి సమన్వయం, సహకారంతో ఉత్తమ ఫలితాలు  

మీడియాతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌

సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణ రాష్ట్రానికి గుండెలాంటి హైదరాబాద్‌ను ఇక్కడ సమృ ద్ధిగా ఉన్న వనరులు, ప్రజల సహకారంతో అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తా. ప్రజా సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధికి, పారదర్శక సేవలకు అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తా. అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగంలో ఉన్న బిగ్‌ డేటా అనలిటిక్స్‌తో సమస్య ఎక్కడ ఉందో సులభంగా గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా..’ అని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ అన్నారు. బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న, వలసలతో పెరిగిపోతున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు  క్షేత్రస్థాయిలో తక్షణ సేవలందేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది నైపుణ్యాన్ని  పెంచాల్సిన అవసరముందన్నారు. పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారంలో అవినీతికి అస్కారం లేకుండా చూడటం ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. 

ప్రజలకు ఆహ్లాదంగా..
ఎస్సార్‌డీపీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు తనముందున్న పెద్దప్రాజెక్టులు కాగా, చెరువుల సుందరీకరణ, ప్లేగ్రౌండ్స్, పార్కుల్ని ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దడంపై శ్రద్ధ వహిస్తానన్నారు. రహదారులపై గుంతల సమస్యపైనా దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఎంపిక చేసిన 23 చెరువుల సుందరీకరణకు ముంబైకి చెందిన కన్సల్టెంట్‌ నివేదిక అందాక పనులు చేపడతామన్నారు. టాయ్‌లెట్ల నిర్వహణలో సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూప్‌లకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాల్లో జాతీయస్థాయితో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ, మరింత మెరుగయ్యేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. చెత్తను తడిపొడిగా వేరు చేయడం జాతీయస్థాయిలో దాదాపు 25 శాతం మాత్రమే ఉండగా, నగరంలో 50 శాతం ఉందన్నారు. ఈ–వేస్ట్, ప్లాస్టిక్‌ వ్యర్థాలు,  వరదకాలువలపై శ్రద్ధ చూపుతానని చెప్పారు. సహకరించే పాలకవర్గం, అనుభవజ్ఞులైన అధికారులు, యువ ఐఏఎస్‌ల సమన్వయం, సహకారాలతో తగిన ప్రణాళికతో మెరుగైన ఫలితాలు సాధించగలనన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ‘ప్రజావాణి’ ‘మైజీహెచ్‌ఎంసీ’ యాప్, తదితరమైన వాటిని మెరుగు పరుస్తానన్నారు. జీహెచ్‌ఎంసీ ద్వారా అందే ప్రజాసేవల్లో గడచిన నాలుగేళ్లలో ఎంతో మార్పు వచ్చినప్పటికీ,మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తానన్నారు. గత కమిషనర్‌ జ నార్దన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను  కొనసాగిస్తానని దానకిశోర్‌ పేర్కొన్నారు. 

థర్డ్‌పార్టీ ఫీడ్‌బ్యాక్‌..
వాటర్‌బోర్డులో మాదిరిగా సమస్య  పరిష్కారమైందీ లేనిదీ, థర్డ్‌పార్టీ ద్వారా ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటామన్నారు. చదివే అలవాటు పెంచేందుకు కాఫీషాప్స్‌లో బుక్స్‌ ఏర్పాటుపై దృష్టిసారిస్తానని పేర్కొన్నారు.

చెత్త సమస్యలు తీవ్రం..
ప్రతి నగరానికీ చెత్త సమస్య తీవ్రంగా ఉందంటూ, ప్రస్తుతం ఒక్కో వ్యక్తి సగటున రోజుకు 500 గ్రాముల చెత్త వెలువరిస్తుండగా, భవిష్యత్‌లో ఇది 1500 గ్రాములకు పెరగనుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎక్కడికక్కడ ఖాళీ ప్రదేశాల్లో  చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తామన్నారు.

మరిన్ని వార్తలు