గ్రేటర్‌లో భవన నిర్మాణ పర్మిషన్‌ ఇక ఈజీ

29 Jun, 2019 12:59 IST|Sakshi
ప్రసంగిస్తున్న కమిషనర్‌ దానకిశోర్‌

గ్రేటర్‌లో భవన నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో 

అన్నింటికీ ఒకటే కామన్‌ అప్లికేషన్‌ 

అందుబాటులోకి తెచ్చిన జీహెచ్‌ఎంసీ 

నిర్మాణదారులకు తప్పనున్న ఇక్కట్లు  

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే డీపీఎంఎస్‌ విధానంలో ఆన్‌లైన్‌ ద్వారానే భవన నిర్మాణ అనుమతులు, ఓసీలు జారీ చేస్తున్న జీహెచ్‌ఎంసీ...నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటున్నవారు ఇతర శాఖల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ అవసరమైతే పలు కార్యాలయాల చుట్టూ తిరిగి వాటిని పొందుతున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్‌ సర్వీసెస్‌ తదితర శాఖల నుంచి వీటిని పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇకపై ఈ శ్రమ లేకుండా ఆన్‌లైన్‌లో కామన్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇతర విభాగాల నుంచి క్లియరెన్స్‌ అవసరమైన పక్షంలో నో అబ్జెక్షన్‌ కోసం జీహెచ్‌ఎంసీయే ఆయా విభాగాలకు ఆన్‌లైన్‌లో పంపిస్తుంది. ఈమేరకు తగిన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది.

ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ఇది విజయవంతం కావడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఇక ఈ కామన్‌ అప్లికేషన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత ఇళ్లు కట్టుకునే వారి నుంచి బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలు నిర్మించే వారి వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. పరిశ్రమలకు టీఎస్‌ఐపాస్‌ తరహాలో జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణాలకు ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

నోఅబ్జెక్షన్‌ అవసరమైన రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్‌సర్వీసెస్, ఫారెస్ట్, ఎలక్ట్రిక్, ఎయిర్‌పోర్ట్, ట్రాఫిక్,అథారిటీ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ మాన్యుమెంట్‌ అథారిటీలతో  జీహెచ్‌ఎంసీ నెట్‌వర్క్‌ అనుసంధానం చేసుకుంది. దరఖాస్తు రాగానే పై వాటిల్లో ఏ శాఖనుంచైనా నో అబ్జెక్షన్‌ అవసరమైతే ఆన్‌లైన్‌ద్వారా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వెళ్తుంది. ఎలాంటి అభ్యంతరం లేనట్లయితే ఓకే చేస్తారు. అభ్యంతరాలుంటే, ఆ విషయాన్నీ తెలియజేస్తారు.

ఈ నేపథ్యంలో భవననిర్మాణాలకు దరఖాస్తుచేసుకునే వారికి ఎంతో సమయం, వ్యయం తగ్గుతాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌(ఈఓడీబీ)లో భాగంగా జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఇప్పటికే పలు సంస్కరణలు అమల్లోకి తేవడం తెలిసిందే. శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, బిల్డర్లు, ఫైర్‌ సర్వీస్, రెవెన్యూ తదితర అధికారులతో జరిగిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ ఈ  సింగిల్‌విండో అనుమతుల విధానాన్ని ప్రకటించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో దరఖాస్తుల పరిశీలన త్వరితంగా జరుగుతున్నప్పటికీ,  ఇతర శాఖల నుంచి ఎన్‌ఓసీలు రావడంలో జాప్యం జరిగేదని, ఇక ఈసమస్య ఉండదన్నారు. డీపీఎంఎస్‌లో ఈ కామన్‌ అప్లికేషన్‌ విధానాన్ని పొందుపరిచినట్లు తెలిపారు.  

ఒక్కరోజులోనే అనుమతి.. 
భవననిర్మాణ అనుమతులు త్వరితంగా జారీ చేసేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు  దానకిశోర్‌ తెలిపారు. ముఖ్యంగా 500 గజాల్లోపు స్థలంలో  ఇళ్ల నిర్మాణాలకు వచ్చే దరఖాస్తులు నిబంధనల ప్రకారం అన్నీ సవ్యంగా ఉంటే ఒకే రోజులో అనుమతి జారీ చేసే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. దీంతోపాటు 200 గజాల్లోపు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు సెల్ఫ్‌ అప్రూవల్‌ ప్రతిపాదన కూడా  ఉందన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ చీఫ్‌సిటీప్లానర్‌ ఎస్‌.దేవేందర్‌రెడ్డి, ఫైర్‌సర్వీసెస్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ పాపయ్య, డా.సుబ్రహ్మణ్యం (ఆస్కి)  పాల్గొన్నారు.  

అందుబాటులోకి నెట్‌వర్క్‌ 
రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్‌సర్వీసెస్, ఫారెస్ట్, ఎలక్ట్రికల్, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నేషనల్‌ మాన్యుమెంట్‌ అథారిటీ శాఖల నుంచి నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిందని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీప్లానర్‌ దేవేందర్‌రెడ్డి తెలిపారు. వీటిల్లో నివాస గృహాలకు ముఖ్యంగా యూఎల్‌సీ, ప్రభుత్వభూమి వంటి సమాచారం కోసం రెవెన్యూతోపాటు ఇరిగేషన్‌ విభాగాల నుంచి ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌)అవసరం అయ్యే అవకాశం ఉందన్నారు. మిగతా  శాఖల నుంచి పెద్దగా ఎన్‌ఓసీ అవసరం ఉండదని, వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాలకు మాత్రం మిగతా శాఖలనుంచీ ఎన్‌ఓసీ అవసరమవుతుందన్నారు.  

మరిన్ని వార్తలు