‘ఫైన్‌ సిటీ’లక్ష్యం

30 Mar, 2017 02:31 IST|Sakshi
‘ఫైన్‌ సిటీ’లక్ష్యం

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి

ప్రశ్న : ఈ ఉగాది లక్ష్యం..?
కమిషనర్‌: వచ్చే ఉగాది నాటికి 20 లక్షల కుటుంబాల నుంచి ఇంటివద్దే చెత్త నూరు శాతం వేరు కావడం లక్ష్యం. మొత్తం చెత్తలో 30 శాతం పొడి చెత్త వల్ల (ప్లాస్టిక్‌ తదితర) ఎలాంటి దుర్వాసన రాదు. ఇంటివద్దనే దాన్ని వేరు చేయడం వల్ల రవాణా ఖర్చు తగ్గుతుంది. గోద్రెజ్, ఐటీసీ వంటి సంస్థలు వీటిని రీసైక్లింగ్‌ చేస్తాయి. వీటిని వేరుచేసే చెత్త కార్మికులకు నెలకు అదనంగా రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు ఆదాయం పెరుగుతుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, స్వచ్ఛ భారత్‌ లక్ష్యాల మేరకు ఈ కార్యక్రమాల్ని అందరి కంటే ముందే ప్రారంభించాం. ఉద్యమ రూపంలో ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నూరు శాతం చేయడం అంటే వాషింగ్టన్, బెర్లిన్, పారిస్‌ వంటి నగరాల సరసన చేరడమే. అతిశయోక్తిగా అనిపించినా ఇది వాస్తవం.

ప్రశ్న: పారిశుధ్య కార్యక్రమాల అమలులో భాగంగా సింగపూర్‌ తరహాలో ఫైన్‌లు వేస్తారా..?
కమిషనర్‌: ఫైన్‌లు వేయడం కంటే ‘ఫైన్‌ సిటీ’గా తీర్చిదిద్దడం లక్ష్యం.అన్నీ తెలిసిన విద్యాధికులే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుండటం, సామాజిక స్పృహ లేకపోవడం దౌర్భాగ్యం. తొలుతే ఫైన్‌లు వేయకుండా తగిన కౌన్సిలింగ్స్‌ నిర్వహిస్తాం. అప్పటికీ మారకపోతే డ్రంకెన్‌ డ్రైవ్‌ మాదిరిగా చలానా వేసే యోచన ఉంది.

ప్రశ్న: దుకాణదారులపై ఎలాంటి చర్యలు చేపడతారు ?
కమిషనర్‌: రోడ్లపై చెత్తవేయడమే కాక ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వ్యాపారులకు పోలీసుల సహకారంతో జరిమానాలు విధిస్తాం. జరిమానాలకు వెరవకుండా మళ్లీమళ్లీ పాల్పడితే క్రిమినల్‌ చర్యలు చేపడతాం. ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నాం. 210 మంది వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. 90 మందికి జైలు శిక్షలు పడ్డాయి.

ప్రశ్న: బహిరంగ మూత్ర విసర్జన చేసేవారికి ఎలాంటి జరిమానా వేస్తున్నారు?!
కమిషనర్‌: గడచిన 60 ఏళ్లలో నగరంలో 500 ప్రదేశాల్లో మాత్రమే పబ్లిక్‌ టాయ్‌లెట్లు ఉండగా, కేవలం మూడు నెలల్లోనే 323 పెట్రోలు బంకుల్లోని టాయ్‌లెట్లను ప్రజలు వినియోగించుకునే అవకాశం కల్పించాం. ఆమేరకు వారు బోర్డులు కూడా పెట్టారు. హోటళ్లలోని టాయ్‌లెట్లనూ ప్రజలు వినియోగించుకునేందుకు హోటళ్ల యాజమాన్యాలతో చర్చిస్తున్నాం. దీన్నో ఉద్యమంగా చేపడతాం. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో తగిన నిర్వహణతో ఉండేలా పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తాం. ఏడాదిలోగా వీటన్నింటినీ పూర్తిచేస్తాం.

మరిన్ని వార్తలు