‘స్మార్ట్‌’ వర్క్‌ కావాలి

27 Feb, 2020 11:48 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆఫీసుల్లో కూర్చున్నప్పుడు సరే.. నగరంలో ప్రయాణిస్తున్నప్పుడైనా స్మార్ట్‌ ఫోన్లకు కాస్తా విరామమివ్వండి. ఫోన్‌ చూస్తూ వెళ్లే బదులు చుట్టుపక్కల కన్నేయండి.  రోడ్లపై గుంతలు, పారిశుధ్యం, వాటర్‌ లీకేజీలు, లైటింగ్‌ తదితర సమస్యలను పరిశీలించండి. ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోండి.. ముఖ్యమైన కాల్స్‌ వస్తే మాట్లాడండి. కానీ..అదేపనిగా ఫోన్‌లోనే మునిగిపోకండి. జరుగుతున్న అభివృద్ధి పనుల్నీ  పరిశీలించండి..అంటూ జీహెచ్‌ంఎసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ అధికారులకు హితోపదేశం చేశారు.  బుధవారం జీహెచ్‌ఎంసీలో అడిషనల్, జోనల్‌ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. సమస్యలెక్కడున్నాయో తెలిస్తే.. సంబంధిత అధికారులు పరిష్కారానికి కృషి చేయొచ్చునన్నారు.

పునరావాస కేంద్రాలకు యాచకులు..  
వివిధ జంక్షన్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు ఆయా ప్రాంతాల్లోని యాచకులను మార్చి రెండోవారంలో పునరావాసకేంద్రాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకుగాను   సర్కిల్, జోనల్‌ స్థాయిల్లో  సంబంధిత ఏజెన్సీలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న నైట్‌ షెల్టర్స్‌ లో తాత్కాలికంగా 24గంటల పాటు భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వార్డుకు రెండు చొప్పున మొత్తం 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం నిర్దేశించినట్లు  కమిషనర్‌ పేర్కొన్నారు.   ప్రస్తుతం  నగరంలో 122 బస్తీ దవాఖానాలు  నడుస్తున్నాయని,  40 బస్తీ దవాఖానాలను  మౌలిక వసతులతో సిద్ధం  చేసినట్లు తెలిపారు. 54 చోట్ల వసతుల కల్పన బాధ్యతలు  జోనల్‌ కమిషనర్లకు అప్పగించామని, మరో 83 ప్రదేశాలను గుర్తించామన్నారు.

ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా  ప్రతి జోన్‌ కు 500 చొప్పున కొత్తగా 3వేల ఆధునిక  పబ్లిక్‌ టాయ్‌లెట్ల నిర్మాణానికి ప్రయత్నాలు జరగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు  1661 లొకేషన్స్‌ గుర్తించగా,  మిగిలిన 1339 లొకేషన్లను గుర్తించాలని జోనల్‌ కమిషనర్లను  ఆదేశించారు. నిర్మాణం, నిర్వహణ భారం కాకుండా బీ.ఓ.ఓ పద్ధతికి కృషి చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని  185 చెరువులను గుర్తించడం జరిగిందని, చెరువుల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మేరకు ఫెన్సింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుధ్య చర్యల్లో భాగంగా తొలిదశలో  షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, వ్యాపార సంస్థల ముందు తప్పనిసరిగా రెండు చెత్త డబ్బాలను వారితోనే ఏర్పాటు చేయించాలని  ఆదేశించారు. నగరంలోని 344 నాలాల్లో  50 నాలాల పూడికతీత ప్రారంభించినట్లు తెలిపారు. తొలగించిన పూడికను అదే రోజు తరలించాలని స్పష్టం చేశారు.  సమావేశంలో  అదనపు కమిషనర్లు  బి.సంతోష్, ప్రియాంక, జె.శంకరయ్య, జయరాజ్‌ కెనెడి,   జోనల్‌ కమిషనర్లు ప్రావీణ్య, ఎన్‌.రవికిరణ్, వి.మమత,  బి.శ్రీనివాస్‌ రెడ్డి, ఉపేందర్‌ రెడ్డి, అశోక్‌ సామ్రాట్, ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కాంపాటి, చీఫ్‌ ఇంజనీర్‌ జియా ఉద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు