ఇదిగో డిజైన్‌

22 Feb, 2019 10:20 IST|Sakshi

నూతన ఇంటి నిర్మాణానికి రెడీమెడ్‌ ప్లాన్‌

500 చ.గ.ల్లోపు ఇళ్లకు 4 వేల ప్లాన్లు సిద్ధం

యాప్‌ ద్వారా ఫైల్‌ ట్రాకింగ్‌ ‘ఫీడ్‌ ద నీడ్‌’కు మరో యాప్‌  

విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు  

ప్రజల ఫిర్యాదులను శ్రద్ధగా ఆలకించిన కమిషనర్‌

సమస్యతో పాటు ఫోన్‌ నంబరూ నోట్‌ చేసుకున్న దానకిశోర్‌  

శివారుల్లో వరదనీరు, డ్రైనేజీ సమస్యలకు త్వరలో పరిష్కారం

యాప్స్‌పై ప్రజలకు అవగాహన సాక్షి ‘ఫోన్‌ ఇన్‌’కు అనూహ్య స్పందన

సాక్షి,సిటీబ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ చేపట్టిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో ‘ఫోన్‌ ఇన్‌’కు నగర పౌరుల నుంచి అనూహ్య స్పందన లభించింది. గురువారం నిర్ణీత సమయం కంటే ముందునుంచే నిర్విరామంగా ప్రజల నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. అందరి ఫిర్యాదులు శ్రద్ధగా విన్న కమిషనర్‌ దానకిశోర్‌.. ఒకటికి రెండుసార్లు అడిగి వారి ప్రాంతం, ఫోన్‌ నంబర్‌ వంటి వివరాలు రాసుకున్నారు. తక్షణ చర్యల కోసం అవసరమైన పీటీఐఎన్, ఇతరత్రా రశీదుల నంబర్లూ అడిగారు. ఓవైపు ఫిర్యాదులు స్వీకరిస్తూనే మరోవైపు నిర్లక్ష్యం కనబరచిన ఇద్దరు అధికారులపై  ఆయన చర్యలు తీసుకున్నారు. కాగా, 500 గజాల్లోపు స్థలంలో ఇళ్లు నిర్మించాలనుకునే యజమానుల కోసం ప్రత్యేక డిజైన్లు రూపొందించినట్లు చెప్పారు.  ఇంటి నిర్మాణానికి పూనుకునేవారు జీహెచ్‌ఎంసీని సంప్రదించి సదరు విస్తీర్ణంలో ఎన్ని అంతస్తుల్లో ఇల్లు కట్టాలనుకుంటున్నారో చెబితే పలు రకరకాల డిజైన్లతో నమూనాలను అందజేస్తారన్నారు.

వాటిలోతమకు నచ్చిన దాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఆ మేరకు దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లోగా ఇంటి నిర్మాణ అనుమతి జారీ చేస్తారు. నిర్మాణం ప్రారంభించేటప్పుడు భూసార పరీక్షల కోసం మాత్రమే ఆర్కిటెక్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ మొత్తం 4 వేల డిజైన్లు అందుబాటులోకి తేనుండగా తొలిదశలో 500 డిజైన్లు అందుబాటులో ఉంచనున్నారు. అంతే కాదు.. తమ దరఖాస్తు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘ఫైల్‌ ట్రాకింగ్‌’ అవకాశం కూడా కల్పించనున్నారు. అందుకు త్వరలోనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌ ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ సందర్భంగా తెలిపారు. అక్రమ నిర్మాణాలు, టౌన్‌ప్లానింగ్‌లో రెడ్‌టేపిజంపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంపై స్పందించిన ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ యాప్‌ పనితీరు, డిజైన్లు, అనుమతులపై ప్రజలకు తగిన అవగాహన కల్పించేందుకు అన్ని జోన్లలో నెలలో ఒకరోజు అవగాహన దినం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీసీపీ, తదితర అధికారులు పాల్గొంటారని తెలిపారు. యాప్‌లో తమ దరఖాస్తు పరిస్థితి ఏంటో ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునన్నారు. సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లకు కూడా డ్యాష్‌బోర్డు ద్వారా ఫైల్‌ ట్రాకింగ్‌  తెలుస్తుందన్నారు.

‘ఫీడ్‌ ద నీడ్‌’ కు మరో యాప్‌
నగరంలో పేదల ఆకలి తీర్చేందుకు చేపట్టిన‘ఫీడ్‌ ద నీడ్‌’ను మరింత విస్తృతంగా అమలు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కమిషనర్‌ దానకిశోర్‌ తెలిపారు. ఈ యాప్‌ ద్వారా ఆహారం అందజేయాలనుకునే వారు తమకు వివరాలు అందిచవచ్చన్నారు. దాంతోపాటు ఆకలితో అలమటించే అన్నార్తులు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నారో కూడా ప్రజలు  తెలియజేయవచ్చునన్నారు. యాప్‌ ద్వారా అందే ఈ సమాచారంతో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో ‘ఫీడ్‌ ది నీడ్‌’ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మ్యాపింగ్‌ చేస్తామన్నారు. తద్వారా ఈ కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు. 

అవగాహనలో భాగంగా..
నగరంలో కొత్తగా ఇల్లు నిర్మించేవారికి.. ఫ్లాట్‌ కొనుగోలు చేసేవారికి.. ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తుల భవనం నిర్మించవచ్చో అవగాహన సదస్సులో సందేహాలు తీరుస్తారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఎలాంటి డాక్యుమెంట్లు అందజేయాలి.. ఎంతమేర సెట్‌బ్యాక్‌లు వదలాలి వివరాలతో పాటు, ఫ్లాట్‌ కొనుగోలు సందర్భంగా జీహెచ్‌ఎంసీ నిర్దేశించిన నిబంధనలను సదస్సులో వివరిస్తారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 23వ తేదీన జరిగే సదస్సుకు 500 గజాలలోపు స్థలంలో ఇల్లు నిర్మించ దలచుకున్నవారు, 2 వేల చ.అ.లోపు ఫ్లాట్‌ కొనుగోలు చేసేవారు హాజరు కావచ్చన్నారు. నగరంలో ఏటా దాదాపు 16 వేల భవన నిర్మాణ అనుమతులు జారీ అవుతుండగా, వీటిలో 13 వేలు ఇండిపెండెంట్‌ ఇళ్లే ఉంటున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులతో పారదర్శకత పాటిస్తున్నప్పటికీ నియమ నిబంధనల గురించి తెలియజేసే వ్యవస్థ లేకపోవడంతో పాటు ప్రజల అవగాహన లోపంతో 10 శాతానికి పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని కమిషనర్‌ దానకిశోర్‌ తెలిపారు. మధ్యవర్తులు, బ్రోకర్లను ఆశ్రయిస్తుండటంతో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయన్నారు. సదస్సులో భాగంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సందేహాలను నివృత్తి చేస్తామన్నారు.  ఇంటి నిర్మాణాలు చేయాలనుకునేవారు తమ స్థల వైశాల్యం, ఎన్ని అంతస్తులు నిర్మించే విషయం, సమర్పించే డాక్యుమెంట్లు తదితర అంశాలకు సంబంధించి ఆసక్తి పత్రాన్ని ఈ అవగాహన సదస్సులో అందజేస్తే వారికి నియమిత సమయంలోగా మార్గదర్శకాలు అందజేయనున్నట్టు చెప్పారు. 23వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ అవగాహన సదస్సును మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభిస్తారని కమిషనర్‌ తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమమన్నారు. 

మరిన్ని వార్తలు