నిరాశ్రయులకు నీడ కల్పిస్తున్నాం

3 Jan, 2019 08:29 IST|Sakshi
కేన్సర్‌ ఆస్పత్రి ఎదుట ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారికి దుప్పట్లు అందజేస్తున్న దానకిశోర్‌

అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌

700 మందికి నైట్‌ షెల్టర్లలో ఆశ్రయం కల్పించామని వెల్లడి

సాక్షి సిటీబ్యూరో:  నగరంలో రహదారులు, ఫుట్‌పాత్‌లపై నిరాశ్రయులు లేకుండా వారికి జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ తెలిపారు. తీవ్రమైన చలి ఉండడంతో నగరంలో ఆసుపత్రులు, బస్టాండ్‌లు, ఇతర జంక్షన్లలో నిద్రిస్తున్న నిరాశ్రయులకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఉచితంగా బ్లాంకెట్లు, దుప్పట్లను బుధవారం రాత్రి పంపిణీ చేశారు. బంజారాహిల్స్‌ బసవ రామ తారకం కేన్సర్‌ ఆసుపత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రించేవారికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ బ్లాంకెట్లను పంపిణీ చేశారు. అడిషనల్‌ కమిషనర్‌ హరిచందన, జోనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ అలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దానకిషోర్‌ మాట్లాడుతూ నగరంలో నిరాశ్రయులు ఉండవద్దనే లక్ష్యంతో 15 నైట్‌ షెల్టర్లను జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. వీటిలో దాదాపు 700 మందికి ఆశ్రయం కల్పించామని పేర్కొన్నారు.

నగరంలో రాత్రిపూట ప్రధాన జంక్షన్లు, ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారిని గుర్తించి వారికి అందుబాటులో ఉన్న జీహెచ్‌ఎంసీ కమ్యునిటీ హాళ్లు, మోడల్‌ మార్కెట్లలో బస కల్పిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి ఇతర రాష్ట్రాలు, వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజు లక్షలాది మంది వివిధ పనుల నిమిత్తం వస్తారని, వీరిలో అధికశాతం మంది జీవనోపాధికై వచ్చి రహదారులు, జంక్షన్ల వద్ద తాత్కాలికంగా బస చేస్తున్నారని అన్నారు. వీరిని గుర్తించి నైట్‌ షెల్టర్లలో బస కల్పించనున్నట్టు కమిషనర్‌ తెలిపారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా నైట్‌ షెల్టర్లు ఉన్నాయని అన్నారు. నగరంలో ఇటీవల రూ. 9.71 కోట్ల వ్యయంతో ఏడు నైట్‌ షెల్టర్ల నిర్మాణం చేపట్టగా మూడింటిని పూర్తి చేశామని తెలిపారు. కింగ్‌కోటిలోని మెటర్నటీ ఆసుపత్రి, మాసబ్‌ ట్యాంక్‌ మహావీర్‌ ఆసుపత్రి, నీలోఫర్‌ ఆసుపత్రిలోని నైట్‌ షెల్టర్లను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. వీటితో పాటు ఈఎన్‌టీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో నైట్‌ షెల్టర్ల నిర్మాణం పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రూ. 5 భోజనం, నైట్‌ షెల్టర్ల ఏర్పాటు తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు దానకిషోర్‌ తెలియజేశారు.

మూడు వేల దుప్పట్ల పంపిణీ
గ్రేటర్‌ హైదరాబాద్‌లో రహదారులు, జంక్షన్లు, తాత్కాలిక గుడిసెల్లో నిద్రిస్తున్న దాదాపు 3 వేల మందికి బ్లాంకెట్లు, దుప్పట్లను జీహెచ్‌ఎంసీ అధికారులు పంపిణీ చేశారు. శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో శిల్పారమం నుంచి కొత్తగూడ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా నిద్రిస్తున్న వారికి జోనల్‌ కమిషనర్‌ హరిచందన, డిప్యూటీ కమిషనర్లు దుప్పట్లను పంపిణీ చేశారు. సికింద్రాబాద్‌ జోన్‌లో అల్వాల్‌ మీ సేవ కేంద్రం, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్, విద్యానగర్, రైల్వేస్టేషన్ల వద్ద నిరాశ్రయులకు జోనల్‌ కమిషనర్‌ సి.ఎన్‌.రఘుప్రసాద్‌ నేతృత్వంలో బ్లాంకెట్ల పంపిణీ జరిగింది. జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌ జోనల్‌లోని ఉప్పల్‌ జంక్షన్, హయత్‌నగర్‌ బస్టాండ్‌ల వద్ద పంపిణీ జరగగా ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ అలీ నేతృత్వంలో బసవతారకం ఇనిస్టిట్యూట్, నీలోఫర్‌ ఆసుపత్రుల వద్ద, జోనల్‌ కమిషనర్‌ శంకరయ్య ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలోని పాలీజ్‌ ప్రాంతాల్లో చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఆరాంఘర్, అత్తాపూర్, మలక్‌పేట్, చాంద్రాయణ గుట్టలలో బ్లాంకెట్ల పంపణీ జరిగింది.

మరిన్ని వార్తలు