వచ్చి చూడు.. వేచి చూడు!

1 Jun, 2018 01:23 IST|Sakshi

హైటెక్‌ బస్‌షెల్టర్‌లో 24 గంటలూ భద్రత, ఏసీ సౌకర్యం

మహిళల రక్షణ కోసం అలర్ట్‌ బటన్‌

వైఫై, మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యం

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని బస్‌షెల్టర్‌లు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. హైటెక్‌ హంగులతో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులకు పూర్తి రక్షణ.. 24 గంటలూ విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది.. నిరంతర ఏసీ సదుపాయం.. మహిళల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు వీటి ప్రత్యేకత. గురువారం ఖైరతాబాద్‌లో అధునాత బస్‌షెల్టర్‌ ప్రారంభమైంది. దేశంలోనే మొట్టమొదటిసారి సకల సదుపాయాలతో నిర్మించిన సరికొత్త బస్‌షెల్టర్‌ ఇది. శిల్పారామం, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, ఖైరతాబాద్‌లో ప్రయోగాత్మకంగా వీటిని నిర్మించారు.

శిల్పారామం బస్‌షెల్టర్‌ వారం కిందట ప్రారంభించగా, కేపీహెచ్‌బీ, ఖైరతాబాద్‌ ఆర్టీఏ బస్‌షెల్టర్లు ప్రయాణికులకు గురువారం అందుబాటులోకి వచ్చాయి. ఖైరతాబాద్‌లో మొత్తం 4 షెల్టర్లను ఏసీ సదుపాయంతో కట్టించారు. ఈ షెల్టర్‌లో 24 గంటలపాటు వైఫై సదుపాయం ఉంటుంది. మొబైల్‌ చార్జింగ్‌ చేసుకోవచ్చు. మహిళలకు, పురుషులకు ప్రత్యేక టాయిలెట్‌లు నిర్మించారు. తడి, పొడి చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు. అన్ని షెల్టర్‌లలోనూ సీసీటీవీలున్నాయి. వీటిల్లో నమోదయ్యే దృశ్యాలు నెలరోజుల బ్యాక్‌అప్‌తో లభిస్తాయి. రాత్రింబవళ్లు విధులు నిర్వహించే విధంగా 3 షిఫ్టుల్లో సెక్యూరిటీ అందుబాటులో ఉంటుంది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా సిబ్బంది రాత్రి, పగలు విధులు నిర్వహిస్తారు.  

మహిళల భద్రత కోసం ప్యానిక్‌ బటన్‌... 
బస్‌షెల్టర్‌లలో, మహిళా టాయిలెట్‌ల వద్ద ఎఫ్‌ఓఎఫ్‌ ప్యానిక్‌ బటన్‌లను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఈ బటన్‌ మోగిస్తే గట్టిగా అలారం వినిస్తుంది. వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమవుతారు. పోలీసులకు సమాచారం అందించేవిధంగా బస్‌షెల్టర్‌ల నిర్వాహకుల కార్యాలయంలోనూ అలారం వినిపించే విధంగా ఏర్పాటు చేశారు. దీనిని త్వరలో పోలీస్‌స్టేషన్లకు కూడా అను సంధానించనున్నట్లు యూనియాడ్స్‌ ప్రతినిధి రాజు ‘సాక్షి’తో చెప్పారు. బస్‌షెల్టర్‌ను పరిశుభ్రంగా ఉం చేందుకు హౌస్‌కీపింగ్‌ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. ఖైరతాబాద్‌లో మొత్తం 4 షెల్టర్లు ఉ న్నాయి. వీటిలో ప్రయాణికులు ఎక్కడ ఉంటే అక్కడ ఏసీ ఆన్‌ చేస్తారు. మిగతా చోట్ల నిలిపివేస్తారు.  

మరిన్ని షెల్టర్లు... 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 826 బస్‌షెల్టర్లను ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ మూడింటిని నిర్మించారు. త్వరలో దిల్‌సుఖ్‌నగర్, కోఠీ, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ల వద్ద బస్‌షెల్టర్లను నిర్మించనున్నారు. దశలవారీగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆధునిక బస్‌షెల్టర్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి కేటగిరీకి చెందిన వాటిని ఏసీ సదుపాయంతో ఏర్పాటు చేస్తుండగా, మిగతా 2 కేటగిరీలకు చెందిన షెల్టర్‌లను నాన్‌ ఏసీ షెల్టర్లుగా నిర్మించనున్నారు.

మరిన్ని వార్తలు