‘అనసూయ’ను కూల్చరా?

13 May, 2019 07:12 IST|Sakshi

‘అనసూయ కాంప్లెక్స్‌’ కొంతభాగం కూల్చిన జీహెచ్‌ఎంసీ

నష్టపరిహారం ఇచ్చి 12ఏళ్లు అవుతోంది

కూల్చివేతపై వెనక్కిమళ్లిన జీహెచ్‌ఎంసీ

రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్య

హిమాయత్‌నగర్‌: రహదారుల విస్తరణలో భాగంగా హిమాయత్‌నగర్‌లోని టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న అనసూయ కాంప్లెక్స్‌ను దాదాపు 15 ఏళ్ల క్రితమే కూల్చాల్సి ఉంది. అయితే అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప కూల్చాలని ఆలోచించడం లేదు.  వంద అడుగుల మేర రోడ్డు విస్తరణకు అప్పట్లో ఎన్నో భవనాలను కూల్చివేసిన అధికారులు ఈ భవనం ముందుభాగాన్ని అంటే....దాదాపు 180 చదరపు గజాల మేర కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. కొద్దిమేర కూల్చివేతలు జరిపాక ఎందుకనోగానీ ఆపివేశారు. ప్రస్తుతం భవనంలో  కూల్చిన ఫ్లోర్ల నుంచి పెచ్చులూడిపడుతున్నాయి. ఈ రహదారిలో ఇక్కడే రోడ్డు విస్తరణ జరగకపోవడంతో బాటిల్‌నెక్‌గా మారి తరచూ ట్రాఫిక్‌ ఇబ్బందులెదురవుతున్నాయి. ఏ క్షణాన్నయినా కూలడానికి సిద్ధంగా ఉన్న ఈభవనం కూలితే పెనుప్రమాదానికి అవకాశం ఉంది. ఈ విషయాల్ని వివరిస్తూ భవనంలోని ఫ్లాట్ల యజమానులు కూల్చివేయాల్సిందిగా ఎన్ని పర్యాయాలు జీహెచ్‌ఎంసీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేరు. రహదారి విస్తరణకోసం ఎప్పుడో కూల్చివేయాల్సిన ఈభవనాన్ని ఇంకా ఎందుకు కూల్చడం లేదన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. 

భయం.. భయం..
తిరుమల తిరుపతి దేవస్థానం కాంప్లెక్స్‌కు  ఎదురుగా అనసూయ కాంప్లెక్స్‌ ఉంది. ఈ మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువ  కావడంతో  లిబర్టీ వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడ్డా ఇక్కడి వరకు వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. కాంప్లెక్స్‌లోని కొంత భాగాన్ని కూల్చివేయాల్సి ఉన్నప్పటికీ, ఆ పనిచేయకపోవడంతో బాటిల్‌నెక్‌గా మారిన ఇక్కడ ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా మారి  సుమారు రెండు కిలోమీటర్ల మేర  ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఇటీవల  కురిసిన వర్షాలకు భవనం పెచ్చులూడి రాలుతున్నాయి. లిబర్టీ వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడితే  స్ట్రీట్‌నెంబర్‌1 వరకు ట్రాఫిక్‌ బారులు తీరుతూ కనిపిస్తుంది.  ఈ క్రమంలో ఈ బిల్డింగ్‌ వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్న ప్రయాణికులపై పెచ్చులు ఊడి పడుతున్నాయని  బిల్డింగ్‌ యజమానులు వాపోతున్నారు. పెచ్చులు  ఊడి పెద్ద ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు  ఎవరంటూ  ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కూల్చమని కోరుతూనే ఉన్నాం
లిబర్టీ వద్ద రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అనసూయ కాంప్లెక్స్‌ ఈ రోడ్డుపై బాటిల్‌నెక్‌గా మారడంతో వేలాది వాహనాలు ఇక్కడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. కూల్చాల్సివున్న ఈ భవనాన్ని కూల్చితే ట్రాఫిక్‌ సమస్యకు ఆటంకం ఉండదని ఇప్పటికీ కోరుతూనే ఉన్నాం. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం ముందుకొచ్చి సమస్యను పరిష్కరిస్తే ప్రయోజనం ఉంటుంది.
– విద్యాసాగర్, ట్రాఫిక్‌ ఏసీపీ, సెంట్రల్‌జోన్‌

పరిశీలించిన అనంతరం కూల్చివేత
ఈ భవనానికి సంబంధించిన సమస్యపై ఒక్కసారి ఫైల్‌ మొత్తాన్ని పరిశీలించి త్వరతగతిన కూల్చిందుకు ఏర్పాట్లు చేస్తాం. ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ఏ ఒక్కదాన్ని మేం ప్రోత్సహించేది లేదు. ఒకవేళ ఈ భవనానికి సంబంధించిన ఏవైనా ఆటంకాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని సరి చేసి మరీ బిల్డింగ్‌ను కూల్చివేస్తాం.– కరుణాకర్, టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ, జీహెచ్‌ఎంసీ

మరిన్ని వార్తలు