మెలమెల్లగా.!

8 May, 2019 08:36 IST|Sakshi

నత్తనడకన క్యాచ్‌పిట్, మ్యాన్‌హోళ్ల మరమ్మతులు  

ఇప్పటికీ 32 శాతం పనులే పూర్తి  

వర్షాకాలంలోగా మిగతావి పూర్తయ్యేనా?  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రహదారులకు ఎక్కువ/తక్కువ ఎత్తులో ఉన్న క్యాచ్‌పిట్లు, మ్యాన్‌హోళ్లతో తరచూ ప్రమదాలు జరుగుతున్నాయి. ఈ సంఘటనల్లో ఎంతోమంది గాయపడుతున్నా రు. మరికొంత మంది మరణించిన ఘటనలూ ఉన్నాయి. దీన్ని నివారించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 9,000 కి.మీ రహదారులకు గాను 2,000 కి.మీ పరిధిలోని ప్రధాన మార్గాల్లో క్యాచ్‌పిట్లు, మ్యాన్‌హోళ్ల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌ దానకిశోర్‌ భావించారు. రహదారులకు సమాంతరంగా ఉండేలా సరిదిద్దాలని ఫిబ్రవరిలో సంబంధిత అధికారులను ఆదేశించారు. దాదాపు రూ.8.31 కోట్లతో 50 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు.

మే లోపు  మరమ్మతులన్నీ పూర్తి చేయాలని, వర్షాకాలం వచ్చేలోగా రహదారులపై క్యాచ్‌పిట్ల సమస్యలతో పాటు నీరు నిలిచే ఇబ్బందులు లేకుండా చూడాలని కమిషనర్‌ సూచించారు. కానీ ఇప్పటివరకు సగం పనులు కూడా పూర్తి కాలేదు. కేవలం 32 శాతం పనులే పూర్తయ్యాయి. ఈ నెలాఖరులోగా మిగతా 69 శాతం పనులు పూర్తికానిపక్షంలో వర్షాకాలంలో మరిన్ని ఇబ్బందులు తలెత్తనున్నాయి. అయితే పనులు నత్తనడకన సాగేందుకు పలు కారణాలున్నాయి. లోక్‌సభ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో పనులను పర్యవేక్షించే అధికారులంతా విధుల్లో పాలుపంచుకోవడం ఒక కారణమైతే, పనులు చేపట్టే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తదితర మరో కారణం. ఇప్పటికైనా అధికారులు పనుల్లో వేగం పెంచి వర్షాకాలం లోగా మరమ్మతులు పూర్తి చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. 

>
మరిన్ని వార్తలు