ఎన్నికల పనులు వేగవంతం

18 Mar, 2019 09:17 IST|Sakshi

సిబ్బందికి తొలిదశ శిక్షణ ప్రారంభించాం

పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటులో నిమగ్నం  

ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తాం

నేటినుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ

లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు

‘సాక్షి’తో హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌  

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వంనేటినుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ప్రవర్తనానియమావళి అమలు తదితర కార్యక్రమాలను హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

ఏప్రిల్‌ 5లోగాఉచితంగా ఓటరు కార్డులు..
కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారి పేర్ల జాబితా ఈ నెల 25వ తేదీన వెలువడుతుంది. వారితోపాటు ఇటీవల నమోదు చేసుకున్న కొత్త ఓటర్లందరికీ  ఉచితంగానే ఓటరు కార్డులు ఏప్రిల్‌ 5వ తేదీలోగా అందజేస్తాం.

పకడ్బందీగా  ప్రవర్తనా నియమావళి
ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే రూ.90 లక్షలకుపైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు జాబితాలో పేర్లు నమోదైన వారితో మదర్‌ రోల్‌ సోమవారం వెలువడుతుంది. ఈ నెల 15వ తేదీవరకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్ల నమోదు జాబితా ఈ నెల 25న వెలువడనుంది.

పోలింగ్‌ శాతం పెంపునకు చర్యలు..
గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో 49 శాతం పోలింగే నమోదైంది. పోలింగ్‌ శాతం పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. దివ్యాంగులను పోలింగ్‌ కేంద్రాల దాకా తీసుకువచ్చేందుకు అవసరమైర రవాణా సదుపాయం కల్పిస్తాం. వారు వాదా యాప్‌ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ర్యా ంప్‌లు ఏర్పాటు చేస్తున్నాం.  

ఇంటింటికీ ఓటరు స్లిప్‌ల పంపిణీ..
ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీలోగా ఇంటింటికీ ఓటరు స్లిప్‌లను అందజేసేందుకు చర్యలు చేపడతాం. అసెంబ్లీ ఎన్నికల అనుభవంతో ఈసారి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం. వీటి పంపిణీకి సంబంధించి ప్రతి రెండు గంటలకోసారి సమాచారం అప్‌డేట్‌ అవుతుంది. తద్వారా ఎన్ని కుటుంబాలకు చేరిందన్నది సులభంగా తెలుస్తుంది. ఇళ్ల వద్ద లేని వారి పోల్‌ స్లిప్‌లను భద్రపరచి సీల్డ్‌ కవర్‌లో  సంబంధిత ఎన్నికల అధికారులకు అందజేస్తాం. పన్నెండు రకాలైన గుర్తింపు పత్రాల్లో దేన్నయినా చూపించి ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.  

జిల్లాలో ప్రస్తుతం ఉన్న పోలింగ్‌ కేంద్రాలు 3,976ఓటర్ల పెరుగుదలను బట్టివీటి సంఖ్యను పెంచుతాం    

నామినేషన్ల స్వీకరణ ఇలా..
హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జాయింట్‌ కలెక్టర్‌ రిటర్నింగ్‌ అధికారులుగా ఉన్నారు. వారి కార్యాలయాల్లోనే  నామినేషన్లు స్వీకరిస్తారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.  
 
ఆ ఈవీఎంలను వినియోగించం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. సంబంధిత ఈవీఎంలను లోక్‌సభ ఎన్నికలకు వినియోగించం. వాటిని పటిష్ట భద్రతలో ఉంచాం.  

ఓట్ల లెక్కింపు కేంద్రాలు అవే..
ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ప్రాంతాలనే దాదాపుగా వినియోగించనున్నాం. ఓట్ల లెక్కింపు కేంద్రాలు సైతం దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలనాటివే ఉంటాయి.  

ఈవీఎంల సంఖ్య..
బ్యాలెట్‌ యూనిట్లు : 6,483
కంట్రోల్‌ యూనిట్లు: 4,802
వీవీ ప్యాట్లు    : 5,141
వీటి తొలిదశ తనిఖీ పూర్తయింది  

ఎన్నికల విధుల్లో24 వేల సిబ్బంది
ఎన్నికల విధుల నిర్వహణకు దాదాపు 24 వేల మంది సిబ్బంది అవసరం. వారిని సమకూర్చుకుంటున్నాం. ఇప్పటికే నియమితులైన వారికి ఆదివారం శిక్షణ ప్రారంభమైంది. మలి దశ శిక్షణ వచ్చే నెల 1, 2, 3వ తేదీల్లో ఇస్తాం  

నోడల్‌ అధికారి నియామకం..
ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసారి ప్రత్యేకంగా నోడల్‌ అధికారిని నియమించాం. జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ జయరాజ్‌ కెనెడీ విధులు నిర్వర్తిస్తారు. ఎన్నికలవిధుల్లో ఉన్నవారందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ అందేలా ఏర్పాట్లు చేశాం. శిక్షణ సమయంలోనే వారికి సంబంధిత ఫారం– 12 అందజేసి, వాటిని భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.  

సువిధ యాప్‌తో..  
ఎన్నికల ర్యాలీలు, ఎన్నికల కార్యాలయాల ఏర్పాటు, ప్రచార వాహనాలు, లౌడ్‌ స్పీకర్లు, హెలికాప్టర్లు, హెలిపాడ్లు తదితర అనుమతుల కోసం సువిధ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు అనుమతులు జారీ చేస్తారు. వీటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలకు వెళ్లనవసరంలేదు.  

ప్రజల భాగస్వామ్యం అవసరం..
ఎంత నిఘా ఉంచినా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలన్నీ అధికారుల దృష్టికి రావు. ప్రజా భాగస్వామ్యంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఉల్లంఘనల దృశ్యాలు ఫొటోలు, వీడియోలు తీసి సీ విజిల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే వెంటనే చర్యలు ప్రారంభమవుతాయి.

మరిన్ని వార్తలు