ప్రజలకే పాఠాలు!

8 Jun, 2019 08:01 IST|Sakshi

‘స్వచ్ఛ’త పాటించని జీహెచ్‌ఎంసీ  

తడి, పొడి చెత్తను కలిపే తీసుకెళ్తున్న స్వచ్ఛ ఆటోలు  

ఇళ్లల్లో మాత్రం వేరు చేయాలని విస్తృత ప్రచారం  

వేరు చేసిచ్చినా దక్కని ఫలితం  

20కి గాను 12 కేంద్రాల్లో ఇదే పరిస్థితి..  

సాక్షి, సిటీబ్యూరో: ఎవరైనా ఎదుటి వారికి చెప్పేముందు తాము ఆచరించి చూపాలి. ఎదుటి వారికి చెప్పి తాము ఆచరించకపోతే అభాసుపాలవుతారు. జీహెచ్‌ఎంసీ తీరు కూడా ఇలాగే ఉంది. ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు చేసివ్వాలని విస్తృత ప్రచారం చేస్తోన్న జీహెచ్‌ఎంసీ..చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోలు వేరు చేసిన తడి, పొడి చెత్తను కలిపే తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదు. పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. ఇంటింటికీ రెండు రంగుల డబ్బాలు పంపిణీ చేసిన బల్దియా వాటిల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని మూడేళ్లుగా చెబుతోంది. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపడుతోంది. ప్రస్తుతం ‘స్వచ్ఛ హైదరాబాద్‌ – షాన్‌దార్‌ హైదరాబాద్‌’ పేరుతో ప్రాంతాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇన్ని చేస్తున్న జీహెచ్‌ఎంసీ ప్రజలు వేరు చేసిస్తున్న చెత్తను స్వచ్ఛ ఆటోలు కలగలిపే తీసుకెళ్తున్నా ఏమీ చేయలేకపోతోంది. దీంతో ఎంత ప్రచారం, ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండాపోతోంది. 

12 కేంద్రాల్లో అంతే...   
ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను సమీపంలోని నిల్వ కేంద్రాలకు తరలిస్తారు. వీటిని చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటివి నగరంలో 20 ఉన్నాయి. ఈ కేంద్రాలకు చెత్తను తరలించే స్వచ్ఛ ఆటోల్లో కేవలం 8 కేంద్రాలకు మాత్రమే తడి, పొడి చెత్తను వేర్వేరుగా తరలిస్తున్నారు. మిగతా 12 కేంద్రాలకు తడి, పొడి చెత్తను కలిపే తీసుకెళ్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా తరలిస్తున్న కేంద్రాల్లోనూ 100 శాతం ఉన్నది ఒక్కటీ లేదు. నామమాత్రంగా తక్కువ శాతం స్వచ్ఛ ఆటోలు మాత్రమే తడి, పొడి చెత్తను వేర్వేరుగా తరలిస్తున్నాయి. వాటి పనితీరును పర్యవేక్షించాల్సిన స్థానిక ఏఎంఓహెచ్‌లు శ్రద్ధ చూపకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఫలితంగా ఏళ్లుగా ఎంత ప్రచారం చేస్తున్నా.. ఎన్ని నిధులు కుమ్మరిస్తున్నా.. బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. 

తడి, పొడి చెత్త వేరు కోసం..  
జీహెహెచ్‌ఎంసీ పంపిణీ చేసిన డబ్బాలు: 44.04 లక్షలు
వీటికి చేసిన ఖర్చు: రూ.28 కోట్లు
ఇళ్ల నుంచి వేరు చేసిన చెత్తను తీసుకెళ్లేందుకు ఉచితంగా పంపిణి చేసిన స్వచ్ఛ ఆటో టిప్పర్లు: 2,500
బ్యాంకు రుణంగా తీసుకున్న వీటి ఈఎంఐలను జీహెచ్‌ఎంసీనే చెల్లిస్తోంది.  

మరిన్ని వార్తలు